Sri Lanka Elections : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితం కాసేపట్లో విడుదల కానుంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్దీ రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా ఓ అభ్యర్థి లీడ్‌లో కొనసాగుతున్నారు. ఆయన పేరు.. అనురకుమార దిసనాయకే. ఈయన మార్క్సిస్ట్ నేత. చైనాకు మద్దతు పలుకుతుంటారు. నేషనల్ పీపుల్స్ పవర్ అలయన్స్ పార్టీ తరఫున దిసనాయకే పోటీ చేశారు. కడపటి సమాచారం అందే సమయానికి దిసనాయకే ఓట్ల విషయంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 10.20 లక్షల ఓట్లను లెక్కించగా.. వాటిలో దాదాపు 53 శాతం ఓట్లను దిసనాయకే(Sri Lanka Elections) పొందడం విశేషం. దిసనాయకే తర్వాతి స్థానంలో సజిత ప్రేమదాస ఉన్నారు. ఈయనకు ఇప్పటిదాకా 22శాతం ఓట్లు వచ్చాయి. ఇక ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మూడో స్థానంలో ఉన్నారు. ఈవివరాలను శ్రీలంక ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరించింది.
Also Read :PM Modi Gifts : జో బైడెన్, జిల్ బైడెన్‌లకు ప్రధాని మోడీ ప్రత్యేక గిఫ్ట్స్ ఇవే..
శ్రీలంకలో మొత్తం 1.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. శనివారం రోజు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ జరిగింది. అంటే పోలింగ్ దాదాపు 8 శాతం మేర తగ్గిపోయింది. పోలింగ్ పూర్తయిన వెంటనే పోస్టల్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఇంకొన్ని గంటల్లో ఎన్నికల ఫలితం రిలీజ్ అవుతుంది. ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఆధారంగా శ్రీలంక దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే, రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు. ఇప్పటిదాకా శ్రీలంకలో ప్రతీసారి అధ్యక్ష ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే రిజల్ట్ వచ్చేసింది. ఈసారి కూడా అలాగే రిజల్ట్ వస్తుందా ? రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును కూడా చేయాల్సి ఉంటుందా ? అనేది వేచిచూడాలి.