Eating Dogs : దక్షిణ కొరియా ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. జంతు హక్కుల పరిరక్షణ దిశగా ముఖ్యమైన ముందడుగు వేయబోతోంది. ఇప్పటివరకు ఆ దేశంలోని చాలా తెగలకు కుక్క మాంసం తినే సంప్రదాయం ఉండేది. దానిపై నిషేధం విధించేందుకు రంగం సిద్ధమైంది. కుక్కలను తినే ఈ కల్చర్‌పై ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియా ఈ నిర్ణయం తీసుకోబోతోంది. సాక్షాత్తూ దేశంలోని ఈతరం యువత కూడా కుక్క మాంసం తినడాన్ని తప్పుపడుతున్నారు. కుక్కలను పెంచుకోవాలే తప్ప.. వాటి మాంసం తినకూడదని వాదిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కుక్క మాంసం తినడంపై , కుక్కలను వధించడంపై బ్యాన్ విధించే ప్రతిపాదన రెడీ చేశామని స్వయంగా దక్షిణ కొరియా అధికార ‘పీపుల్ పవర్ పార్టీ’ పాలసీ చీఫ్ యు ఇయు-డాంగ్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో ఈవిషయాన్ని ఆయన తెలిపారు. ‘‘దేశంలోని జంతుహక్కుల కార్యకర్తలు కూడా కోర్టులలో దీనిపై కేసులు వేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కుక్క మాంసం తినే కల్చర్‌పై బ్యాన్ విధించక తప్పేలా లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ముసాయిదాబిల్లును ఈ సంవత్సరం దక్షిణ కొరియా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
Also Read: Su-57 : రష్యా నుంచి భారత్‌కు పవర్‌ఫుల్ ఫైటర్ జెట్.. విశేషాలివీ..
ఇదే అంశంపై దక్షిణ కొరియా వ్యవసాయ శాఖ మంత్రి చుంగ్ హ్వాంగ్-కీన్ మాట్లాడుతూ.. కుక్క మాంసం పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది.. ఇతర పనుల వైపు మళ్లేందుకు ప్రభుత్వం తగిన సాయం అందిస్తుందని ప్రకటించారు. దక్షిణ కొరియా అధ్యక్షురాలు కిమ్ కియోన్ హీ మొదటినుంచే కుక్క మాంసం వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన భర్త అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌తో కలిసి ఆమె ఎన్నో వీధి కుక్కలను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు.దక్షిణ కొరియాలో 1,150 కుక్కల పెంపకం కేంద్రాలు, 34 కుక్కల మటన్ విక్రయించే దుకాణాలు, 219 కుక్కల మటన్ పంపిణీ సంస్థలు, 1,600 కుక్కల మటన్ వంటకాలు తయారు చేసే రెస్టారెంట్లు ఉన్నాయి.