అమెరికాలో గ్రీన్ కార్డు (Green Card) కోసం ఎదురుచూస్తున్న లక్షలాది వలసదారులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ముఖ్యంగా EB-3 కేటగిరీలో ఉన్న స్కిల్డ్ వర్కర్లు, ప్రొఫెషనల్స్ గ్రీన్ కార్డు కోసం 12 నుంచి 40 సంవత్సరాలు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అమెరికాలో వలస చట్టాలు క్లిష్టంగా ఉండగా, ఈ మార్పులు వీసా పొందడం మరింత కష్టతరం చేస్తున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులు, వైద్యులు, ఇతర నైపుణ్య వృత్తి నిపుణులపై పడనుంది.
Increase Working Hours : ఏపీలో రోజువారీ పని గంటలు పెంపు
ఇక తాజాగా H1B వీసా అప్లికేషన్ ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం వలసదారులపై మరింత ఆర్థిక భారాన్ని మోపింది. ఇప్పటివరకు కొన్ని వేల డాలర్ల పరిధిలో ఉన్న ఫీజు, ఒక్కసారిగా ఈ స్థాయికి పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలకు ఇది తీరని సమస్యగా మారింది. అంతేకాకుండా, ప్రతి సంవత్సరం వీసా రీన్యూవల్ కోసం ఈ భారీ మొత్తం చెల్లించాల్సి రావడం అనేక మందిని ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రీన్యూవల్ ఖర్చులు ఈ స్థాయికి పెరగడం వల్ల ఉద్యోగం కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నవారు అమెరికాలో ఉండటం మరింత క్లిష్టమవుతుంది.
వలస నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ కొత్త నిబంధనలు అమెరికాలో ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడం కంటే వారిని దూరం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాలు స్కిల్డ్ వర్కర్లకు సులభమైన వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ అవకాశాలు ఇస్తున్నాయి. అలాంటప్పుడు అమెరికా వలస విధానాలు ఇంత కఠినతరం చేయడం అక్కడి కంపెనీలకే మానవ వనరుల కొరతను తెచ్చిపెడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ట్రంప్ వ్యాఖ్యలు, మరోవైపు భారీ ఫీజుల భారంతో అమెరికాలో కలల జీవితం కష్టసాధ్యమవుతుందనే భావన వలసదారులలో పెరుగుతోంది.

