South Korea: ఉత్తర కొరియా సరిహద్దుల్లో ప్రచార ప్రక్రియలో భాగంగా దక్షిణ కొరియా స్థాపించిన భారీ లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం రెండు కొరియా దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతను తగ్గించడానికి తీసుకున్న ప్రాథమిక చర్యగా పేర్కొనబడుతోంది. ముఖ్యంగా, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఈ చర్యను హర్షాతిరేకాలతో స్వాగతించారు. ఇటీవలే అధికారాన్ని చేపట్టిన దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో ఇరు దేశాల మధ్య బంధాన్ని మెరుగుపరచడమే తన ప్రధాన అజెండా అని హామీ ఇచ్చిన లీ, పదవిలోకి వచ్చి కేవలం వారం రోజుల్లోనే ఈ కీలక చర్యకు శ్రీకారం చుట్టారు. గత కొన్నేళ్లుగా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఈ స్పీకర్ల శబ్దాల వల్ల తీవ్ర ఇబ్బందులకు లోనవుతుండటంతో, ఇప్పుడు వారు ఊపిరిపీల్చుకున్నారు.
Read Also:Super Six promises : తల్లికి వందనం నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
ఇక, భవిష్యత్తులో ఉత్తర కొరియాతో మెలకువగా వ్యవహరించాలన్న దక్షిణ కొరియా సంకల్పానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో, దక్షిణ కొరియా ఏర్పాటు చేసిన ఈ లౌడ్ స్పీకర్ల ద్వారా ఉత్తర కొరియా పాలనను విమర్శించే ప్రసంగాలు, ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై సమాచారాన్ని ప్రసారం చేస్తూ వచ్చారు. ఈ ప్రక్రియను ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దాన్ని యుద్ధ ప్రకటనగా కూడా పరిగణించింది. ఒక దశలో, స్పీకర్లను తాము పేల్చివేస్తామన్న హెచ్చరికలు కూడా వెలువడాయి. 2018లో ఇరు దేశాల మధ్య తాత్కాలిక సఖ్యత నెలకొన్న సమయంలో స్పీకర్ల వినియోగాన్ని ద. కొరియా నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ, 2023 జూన్‌లో ఉత్తర కొరియా నుంచి రాసేసిన చెత్త బెలూన్లు భారీగా సరిహద్దులు దాటి రావడంతో, దక్షిణ కొరియా తిరిగి స్పీకర్ల వినియోగాన్ని ప్రారంభించింది. ఇవి పగలు 10 కిలోమీటర్లు, రాత్రివేళల్లో దాదాపు 24 కిలోమీటర్ల దూరం వరకు వినిపించే శక్తిని కలిగి ఉంటాయి.
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆయన మిలటరీ పాలన విధించిన తరువాత దేశంలో వ్యతిరేకత పెరిగింది. ఆర్థిక, సైనిక రంగాల్లోనూ గందరగోళం నెలకొనడంతో ఆయనకు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం లీ జే-మ్యుంగ్ తీసుకుంటున్న మృదువైన చర్యలు, ప్రజలు ఆశిస్తున్న శాంతి మార్గాన్ని సూచిస్తున్నాయి. ఉత్తర కొరియా కూడా దానికి సానుకూలంగా స్పందిస్తే, కొరియా ద్వీపకల్పంలో శాశ్వత శాంతికి ఇది మొదటి అడుగవుతుందన్న నమ్మకం పెరుగుతోంది.
Read Also: Thalliki Vandanam : ఈ మూడు పనులు చేస్తేనే రూ.15వేలు..లేదంటే అంతే సంగతి !!