Jeddah Tower: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా దుబాయ్ గర్వకారణం బుర్జ్ ఖలీఫా నిలుస్తోంది. కానీ త్వరలోనే ఆ కిరీటం మరో భవనం సొంతం కానుంది. ఇప్పటికే 80 అంతస్తుల వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కొత్త భవనం ముందు బుర్జ్ ఖలీఫా కూడా చిన్నబోనుంది.
ఎక్కడ నిర్మిస్తున్నారు?
సౌదీ అరేబియాలో నిర్మితమవుతున్న జెడ్డా టవర్ ప్రపంచంలోనే కొత్త ఎత్తైన కట్టడంగా రికార్డు సృష్టించబోతోంది. ఈ భవనం 1000 మీటర్ల (1 కిలోమీటర్) కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకోనుంది. అంటే ఇది బుర్జ్ ఖలీఫా కంటే సుమారు 172 నుండి 180 మీటర్ల వరకు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. సౌదీ విజన్ 2030లో భాగంగా ఈ మెగా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ పనులు జనవరి 2025లో తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రతి మూడు నుండి నాలుగు రోజులకు ఒక కొత్త అంతస్తును నిర్మిస్తున్నారు. ఇదే వేగంతో పనులు సాగితే 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
Also Read: వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!
తొలిసారిగా 1 కిలోమీటర్ రికార్డు
గతంలో ‘కింగ్‌డమ్ టవర్’గా పిలువబడే ఈ జెడ్డా టవర్ మానవ నిర్మాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. కిలోమీటరు ఎత్తును దాటే ప్రపంచంలోని మొదటి భవనం ఇదే కావడం విశేషం. ఇందులో విలాసవంతమైన ‘ఫోర్ సీజన్స్ హోటల్’, ప్రీమియం నివాసాలు, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్‌లు, అత్యాధునిక ఆఫీస్ స్పేస్‌లు ఉంటాయి. ఇక్కడ ఉండే ‘స్కై-హై అబ్జర్వేషన్ డెక్’ ద్వారా ఎర్ర సముద్రం, జెడ్డా నగరం అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.
లిఫ్ట్ వేగం ఎంత ఉంటుంది?
బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ ఈ జెడ్డా టవర్‌ను కూడా రూపొందించారు. సౌదీ అరేబియాలోని వేడి వాతావరణాన్ని తట్టుకునేలా ఇందులో అధునాతన కూలింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక్కడ అమర్చే లిఫ్టులు సెకనుకు 10 మీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. దీనివల్ల పై అంతస్తులకు చేరుకోవడం చాలా సులభం అవుతుంది. ప్రస్తుతం ఇది 828 మీటర్ల ఎత్తుతో, 163 అంతస్తులతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ 2028 నాటికి జెడ్డా టవర్ ఈ స్థానాన్ని భర్తీ చేయనుంది.
