LGBT – Extremist : లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (LGBT) సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలపై రష్యా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. LGBT సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలను ‘‘తీవ్రవాదులు’’గా పేర్కొనాలని దేశ అధికార యంత్రాంగానికి న్యాయస్థానం నిర్దేశించింది. ‘‘అంతర్జాతీయ LGBT సామాజిక ఉద్యమం’’పై బ్యాన్ విధించమని కోరుతూ రష్యా న్యాయశాఖ నుంచి వచ్చిన అభ్యర్థనకు ఆమోదం తెలిపామని సుప్రీంకోర్టు ప్రిసైడింగ్ న్యాయమూర్తి ప్రకటించారు. ప్రకృతి విరుద్ధమైన లైంగిక సంబంధాలను ప్రోత్సహించడంపై, లింగమార్పిడి శస్త్రచికిత్సలపై ఇప్పటికే రష్యా ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ చర్యలకు కొనసాగింపుగానే తాజాగా రష్యా సుప్రీంకోర్టు నుంచి పై ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇకపై రష్యాలో నిరసనలకు దిగే స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధుల అరెస్టులు పెరగొచ్చని భావిస్తున్నారు. వారిపై కేసుల నమోదును కూడా పోలీసులు పెంచనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
స్త్రీ, పురుష లింగాలు తప్ప ఇతర డజన్ల కొద్దీ లింగాల వారిని గుర్తించడానికి తాము సిద్ధంగా లేమని రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో చాలాసార్లు తేల్చి చెప్పారు. ఇతర లింగాల వారి హక్కుల గురించి రష్యాపై ఒత్తిడి పెంచే హక్కు పశ్చిమ దేశాలకు కానీ, ఇతర సంస్థలకు కానీ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై అలాంటి లింగాల వారి ఆగడాలను ఉపేక్షించబోమని ఆయన చెప్పారు. 2024 మార్చిలో జరిగే రష్యా అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు పుతిన్ రెడీ అవుతున్నారు. వాటిలోనూ గెలిస్తే.. ఆయన మరో ఆరేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశాన్ని(LGBT – Extremist) దక్కించుకుంటారు.
