150 Killed : మాస్కోలో ఉగ్రదాడి.. 150కి చేరిన మృతులు.. 11 మంది అరెస్ట్

150 Killed : రష్యా  రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ హాలులో నలుగురు  ఉగ్రమూకల రక్తక్రీడకు 150 మంది బలయ్యారు.

  • Written By:
  • Updated On - March 24, 2024 / 07:40 AM IST

150 Killed : రష్యా  రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ హాలులో నలుగురు  ఉగ్రమూకల రక్తక్రీడకు 150 మంది బలయ్యారు. మరో 200 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదుకునేందుకు రక్తం, ప్లాస్మా దానానికి వందల మంది ప్రజలు బారులు తీరారు. మృతుల సంఖ్య(150 Killed) ఇంకా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాత్రి క్రాకస్ సిటీ హాలులో ప్రముఖ బ్యాండ్ పిక్‌నిక్ ఈవెంట్ జరుగుతుండగా.. సైనిక దుస్తుల్లో లోపలికి ప్రవేశించిన సాయుధ దుండుగులు నరమేధానికి తెగబడ్డారు. తొలుత బాంబులు క్రాకస్ సిటీ హాలులో నలువైపులా బాంబులు విసిరారు. అనంతరం తుపాకులతో జనంపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బాంబుల ధాటికి భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.  అనంతరం రష్యా భద్రతా బలగాలు రంగంలోకి దిగి.. నలుగురు ఉగ్రవాదులు, ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. కాగా, గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి.

We’re now on WhatsApp. Click to Join

ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా అనుమానిస్తోంది. తాము అదుపులోకి తీసుకున్న నలుగురు ఉగ్రవాదులు మొదటి నుంచీ ఉక్రెయిన్‌తో టచ్‌లో ఉన్నారని, ఆ దేశం సహకారంతోనే రష్యాలోకి చొరబడ్డారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ బ్యూరో ఆరోపిస్తోంది.అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. తమకు ఈ ఉగ్రదాడితో సంబంధం లేదని స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని అమెరికా తెలిపింది. మరోవైపు ఈ దాడికి పాల్పడింది తామే అంటూ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్‌ స్టేట్‌ – ఖొరాసన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని తాము రెండు వారాల క్రితమే రష్యాను అలర్ట్ చేశామని అమెరికా అంటోంది.

Also Read :CM Ramesh: 450 కోట్ల ఫోర్జరీ కేసులో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌

ఉగ్రదాడి ఘటనపై స్పందించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ .. ఈ దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాపదినం పాటించాలని పుతిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘రక్తపాతం సృష్టించిన ఉగ్రవాద చర్యకు సంబంధించి నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నాను.. ఈ ఘటనలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినంగా ప్రకటిస్తున్నా’ అని పుతిన్‌ చెప్పారు. మొత్తం  11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నామని, వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Also Read :Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల