US : వీసా గడువు దాటి అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy in India) తాజాగా కీలక అడ్వైజరీ విడుదల చేసింది. పర్యాటక, విద్యార్థి, ఉద్యోగ సంబంధిత వీసాలపై అమెరికాలో ఉన్నవారు వీసా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. తప్పులైతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉండటం అమెరికా చట్టాలకు విరుద్ధం. ఇలా చేయడం వల్ల వీసా రద్దు, బహిష్కరణతో పాటు భవిష్యత్‌లో వీసా పొందే అవకాశాలు పూర్తిగా కోల్పోవచ్చు. ఈ చర్యల వల్ల విద్య, ఉద్యోగ, ప్రయాణ అవకాశాలపై శాశ్వత ప్రతికూల ప్రభావం పడవచ్చు అని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. ఇప్పటికే అమెరికాలో వలస విధానాలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో, గడువు దాటి ఉన్నవారి మీద మరింత నిఘా పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ పాలనలో వలస విధానాలకు ఉక్కుపాదం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసలకు వ్యతిరేకంగా గట్టి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టూరిస్ట్, బిజినెస్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు $15,000 (దాదాపు ₹13 లక్షలు) బాండ్ రూపంలో చెల్లించాల్సిందిగా విదేశాంగ శాఖ ప్రతిపాదన చేసింది. వీసా గడువు ముగిసిన తర్వాత చట్టబద్ధంగా దేశం విడిచినవారికి ఈ మొత్తం తిరిగి చెల్లిస్తారు. కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రీఫండ్ లేదు. ఈ విధంగా, వీసా దుర్వినియోగాన్ని నియంత్రించేందుకే ఈ విధానాలను తీసుకొచ్చారు.
ఇండియన్ H1-B వీసాదారులపై అమెరికా చట్టసభ సభ్యురాలి విమర్శలు
ఇటీవల అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు మార్జరీ టేలర్ గ్రీన్, భారతీయ హెచ్1-బీ వీసాదారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇది భారతీయుల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి. హెచ్1-బీ వీసాలను నిలిపివేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హెచ్1-బీ వీసాలపై వచ్చే భారతీయుల సంఖ్య అధికంగా ఉండటంతో, కొన్ని వర్గాలు అమెరికన్ల ఉద్యోగ భద్రతపై ప్రశ్నలు వేస్తున్నాయి. కానీ వాస్తవానికి అమెరికా టెక్ రంగానికి భారతీయ నిపుణులే పెద్ద దిక్సూచి అవుతున్నారు. అయినప్పటికీ, కొన్ని రాజకీయ వర్గాలు వీసా విధానాలను కఠినతరం చేయాలని పట్టుబడుతున్నాయి.
భారతీయులకు సూచనలు
అమెరికాలో ఉన్న భారతీయ వీసాదారులకు ఈ అడ్వైజరీ మేల్కొలుపు కాల్ లాంటిదే. మీ వీసా గడువును గమనిస్తూ, చట్టపరంగా వీసా పొడిగింపు లేదా దేశం విడిచే ఏర్పాట్లు చేసుకోవాలి. వీసా గడువు ముగిసిన తర్వాత అనధికారికంగా దేశంలో ఉండటం మీ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుంది. అమెరికాలో చదువుకోవడం, పని చేయడం, స్థిరపడాలనుకునే భారతీయులు చట్టాలను గౌరవించడం అత్యంత అవసరం. వీసా నిబంధనలు ఉల్లంఘించినవారిపై ప్రస్తుతం కఠినమైన చర్యలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం, భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశముంది.