Trump- PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ విషయాన్ని భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఈ విషయంలో మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండాలని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read: టీ20 వరల్డ్ కప్.. భారత్-పాక్ మ్యాచ్ జరగకుంటే రూ. 4,500 కోట్ల నష్టం?!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోని సమయంలోనే ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు.
మార్చి 2025 నుండి భారత్- అమెరికా ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి. అయితే, గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
భారతీయ ఎగుమతులపై 50% టారిఫ్
గత ఏడాది ఆగస్టు (2025) నుండి అమెరికా భారతీయ వస్తువుల ఎగుమతులపై మొత్తం 50% భారీ టారిఫ్ (సుంకం) విధించింది. ఇది ప్రపంచంలోనే ఏ దేశంపైనా లేనంత అత్యధిక సుంకం కావడం గమనార్హం. ఈ 50% సుంకంలో 25 శాతం కేవలం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేస్తున్నందున ‘పెనాల్టీ’గా విధించబడింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఉన్న ఆంక్షలను భారత్ పట్టించుకోవడం లేదన్న కారణంతో అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
