Randy George: మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా సైన్యంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను తక్షణమే పదవీ విరమణ చేయాల్సిందిగా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఆదేశించారు. ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేస్తున్న కీలక సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పెంటగాన్ ఈ విషయాన్ని ధృవీకరించినప్పటికీ.. ఆయనను తొలగించడానికి గల అసలు కారణాలను ఇంకా వెల్లడించలేదు.
సీబీఎస్ (CBS) నివేదిక ప్రకారం.. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పీట్ హెగ్‌సెత్ సైన్యంలో వరుసగా భారీ మార్పులు చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న భద్రతా విధానాలకు అనుగుణంగా సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు అనేకమంది సీనియర్ జనరల్స్, అడ్మిరల్స్‌ను తొలగించడం లేదా వారిని ముందస్తు పదవీ విరమణ చేయించడం జరిగింది.
Also Read: ఈరోజు బ్యాంక్‌లకు హాలిడే ఉందా?
జనరల్ రాండీ జార్జ్ నేపథ్యం
జనరల్ రాండీ జార్జ్ అత్యంత అనుభవజ్ఞులైన సైనికాధికారి. వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీలో చదువుకున్న ఆయన గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల్లో పనిచేశారు. 2023లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన అంతకుముందు ఆర్మీ వైస్ చీఫ్‌గా కూడా పనిచేశారు. మాజీ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు సైనిక సలహాదారుగా కూడా సేవలందించారు.
అమెరికా సైన్యంలో భారీ ప్రక్షాళన
పెంటగాన్‌లో జరుగుతున్న ఈ భారీ మార్పుల్లో భాగంగా ఇటీవల ఒక డజనుకు పైగా సీనియర్ సైనికాధికారులను తొలగించడం లేదా వారు ముందస్తు పదవీ విరమణ చేయడం జరిగింది. జనరల్ జార్జ్‌తో పాటు ఆయన డిప్యూటీ జనరల్ జేమ్స్ మింగస్‌ను కూడా వారి పదవుల నుండి తప్పించి, కొత్తవారిని నియమించారు. అంతకుముందు నావికాదళం, వైమానిక దళాలకు చెందిన సీనియర్ అధికారులను కూడా తొలగించారు. అంతేకాకుండా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ చార్లెస్ బ్రౌన్‌ను కూడా అధ్యక్షుడు ట్రంప్ తొలగించారు. అమెరికా సైన్యంలో జరుగుతున్న ఈ సమూల మార్పులు భవిష్యత్తులో ఆ దేశ రక్షణ వ్యూహాలను, పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
