Greece Wildfire : గ్రీస్ దేశంలోని పలు ప్రాంతాలు మరోసారి మంటల్లో చిక్కుకున్నాయి. ఆ దేశంలోని అడవుల్లో కార్చిచ్చు రాచుకుంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని అడవుల్లోనూ కార్చిచ్చు రగులుతుండటంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కార్చిచ్చు సెగలు ఏథెన్స్ నగర శివారు ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దాని నుంచి విడుదలవుతున్న పొగలు నగరంలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఏథెన్స్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలోని వర్నవాస్ గ్రామం వద్ద ప్రస్తుతం కార్చిచ్చు(Greece Wildfire) తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో మంటలను ఆర్పేందుకు అక్కడి అటవీ ప్రాంతానికి 400 మంది అగ్నిమాపక సిబ్బందిని, 16 వాటర్ బాంబింగ్ ప్లేన్లను, 13 హెలికాప్టర్లను పంపారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మంటలను ఆర్పే ప్రక్రియ కొనసాగింది. మంటల ధాటికి ఆకాశం ఆరెంజ్ రంగులోకి మారినట్టుగా కనిపించిందని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ కార్చిచ్చు వర్నవాస్ గ్రామం ప్రజల ప్రాణాలకు పెనుగండంలా కనిపిస్తోందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అడవుల్లో దాదాపు 25 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న మంటలు పెద్దపెద్ద చెట్లను కూడా క్షణాల్లో బూడిదగా మారుస్తున్నాయని తెలిపారు. వర్నవాస్ గ్రామంలో దాదాపు 1800 జనాభా ఉంది. గత కొంతకాలంలో గ్రీస్ దేశంలో వర్షాల జాడలేదు. దీంతో అడవుల్లోని చాలా చెట్లు ఎండిపోయి శుష్కించాయి. పైగా జూన్, జులై నెలల్లో ఎండలు మండిపోయాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండల ధాటివల్లే ఇప్పుడు కార్చిచ్చు చెలరేగి దేశంలోని పలు నగరాలను సంక్షోభంలోకి నెట్టింది.
మరోవైపు కార్చిచ్చు భయంతో గ్రీస్‌లోని మారథాన్ టౌన్‌లోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించారు. వాళ్లందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మారథాన్ రేసు పురుడు పోసుకుంది ఈ గ్రామంలోనే. మారథాన్ టౌన్‌లోని దాదాపు 6 కాలనీల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించామని అధికార వర్గాలు వెల్లడించాయి. 2004లో ఏథెన్స్ నగరంలో ఒలింపిక్స్ జరిగాయి. ఏథెన్స్ నగరం నుంచి 30 కి.మీ దూరంలోనే మారథాన్ గ్రామం ఉంది. కార్చిచ్చు నుంచి వస్తున్న పొగల వల్ల శ్వాసకోశ సమస్యలున్న వారు ఇబ్బంది పడుతున్నారు. మారథాన్ గ్రామంలో ఈ విధమైన సమస్య ఎదుర్కొన్న పలువురిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.