India Vs Pakistan : పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ వార్ మోడ్‌లోకి వచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడికి రెడీ అవుతోంది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ కూడా సన్నాహాలు చేస్తోంది. భారత్ దాడికి దిగితే తిప్పికొట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తాజాగా ఇవాళ కూడా ఆ దిశగా ఇరుదేశాల్లో కసరత్తు జరుగుతోంది. ఆ వివరాలను తెలుసుకుందాం..
Also Read :China Vs US : అమెరికా నీచం.. చైనా ఉద్యోగులు, సైనికులకు ఓపెన్ ఆఫర్
అరేబియా సముద్రంలో భారత్ గస్తీ ముమ్మరం
భారత్, పాకిస్తాన్ మధ్య అరేబియా మహాసముద్రం ఉంది. పాకిస్తాన్(India Vs Pakistan)లో అరేబియా సముద్రం తీరాన సింధ్ రాష్ట్రం ఉంది. భారత్‌లో అరేబియా సముద్రం తీరాన గుజరాత్ రాష్ట్రం ఉంది. అరేబియా సముద్ర జలాల్లో భారత్, పాకిస్తాన్‌ల సరిహద్దులు ఎక్కడున్నాయి అనే దానిపై మొదటినుంచే ఇరుదేశాల నడుమ వివాదం నడుస్తోంది. ప్రత్యేకించి సర్ క్రీక్ ప్రాంతం విషయంలో భారత్, పాక్‌ల మధ్య చాలా దశాబ్దాలుగా జగడం నడుస్తోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అరేబియా మహా సముద్రంలో భారత నౌకాదళం గస్తీని ముమ్మరం చేసింది. ఒక నౌక, ఒక జలాంతర్గామి, ఒక హెలికాప్టర్‌లు అరేబియా సముద్రంలో ముందుకు సాగుతున్న ఒక ఫొటోను భారత నౌకాదళం విడుదల చేసింది. ‘‘భారత నేవీ త్రిశూల శక్తి.. సముద్రం పైన.. కింద.. అలల మీదుగా’’ అని అర్థం వచ్చేలా ఆ ఫొటోకు ‘Anytime Anywhere Anyhow’ అనే క్యాప్షన్ పెట్టారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగిన తర్వాత నుంచి భారత సైన్యం శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే వీడియోలను భారత సైనిక విభాగాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. గస్తీ కోసం అన్ని రకాల వ్యవస్థలను భారత నౌకాదళం వినియోగించుకుంటోందని దీనితో స్పష్టం అవుతోంది. ఈ ఫొటోలో ఉన్నది ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్. ఐఎన్‌ఎస్ కోల్‌కతాతో పాటు స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి కూడా ఇందులో ఉన్నాయి.
Also Read :Police Vehicles Vs Challans : పోలీసు వాహనాలపై 17,391 పెండింగ్ ఛలాన్లు.. అర కోటికిపైనే బకాయీ
స్కార్పీన్ జలాంతర్గామి గురించి..
స్కార్పీన్ జలాంతర్గాములు శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములను వేటాడగలవు. ఇవి నిఘా పెట్టి సమాచారాన్ని సేకరిస్తాయి. , సాగరజలాల్లో మందుపాతరలు అమర్చగలవు. నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యర్థుల కదలికలపై కన్నేసి ఉంచగలవు. ఫ్రాన్స్ సహకారంతో స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గాములను భారత్ నిర్మించింది. వీటికి శత్రువుల నిఘా సాధనాలకు దొరకని అద్భుతమైన స్టెల్త్ లక్షణాలు ఉన్నాయి. స్కార్పీన్ జలాంతర్గాములు టోర్పిడోలు, నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించగలవు. ఇక భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్ కోల్‌కతా ప్రధాన డెస్ట్రాయర్. ఇది భారత నౌకాదళానికి చెందిన శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటి.
అబ్దాలి క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్
మరోవైపు పాకిస్తాన్ సైన్యం కూడా మిస్సైళ్లను వరుసపెట్టి టెస్ట్ చేస్తోంది. తాము కూడా ప్రతిదాడికి సిద్ధమనే సందేశాన్ని భారత్‌కు పంపుతోంది. తాజాగా ఇవాళ అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది.ఇది భూతలం నుంచి భూతలంపైకి వెళ్లి లక్ష్యాలను ఛేదించగలదు. దీని టార్గెట్ రేంజ్ 450 కి.మీ. పాక్ తరచూ ఇలాంటి క్షిపణి పరీక్షలు చేస్తూ భారత్‌ను రెచ్చగొడుతోందని భారత రక్షణశాఖ అధికార వర్గాలు అంటున్నాయి. గత తొమ్మిది రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులు జరుపుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.