Pakistan Air Strikes : ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ సైన్యం విరుచుకు పడింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు పాకిస్తాన్ సరిహద్దులోని ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఖోస్ట్, పక్టికా ప్రావిన్సుల్లోని పౌరుల నివాసాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈవివరాలను ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. పాకిస్తాన్ దాడులను ఖండిస్తున్నామని, ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి ఈ దాడులు చేశారని పేర్కొంది. పాక్ వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు చనిపోయారని వెల్లడించింది. మృతిచెందిన వారిలో అందరూ మహిళలు, పిల్లలే ఉన్నారని తాలిబన్ సర్కారు తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీ బాధ్యతారహితంగా దాడులు చేయడం వల్ల సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
అంతకుముందు రోజు (ఆదివారం) ఆఫ్ఘన్ సరిహద్దు వెంటనున్న పాక్ భూభాగంలో పాకిస్తాన్ సైన్యంపై ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు(Pakistan Air Strikes) చేసింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో జరిగిన చాలా ఉగ్రదాడుల వెనుక తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ ఉంది. ఈ ఉగ్ర సంస్థ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏరియాలు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆదివారం రోజు టీటీపీ మిలిటెంట్ల దాడిలో పలువురు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఈ సైనికుల అంత్యక్రియల సమయంలోనే ప్రతీకారం తీర్చుకుంటామని జర్దారీ ప్రకటించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పాక్ ఆర్మీ తాజాగా సోమవారం తెల్లవారుజామున ఆప్ఘనిస్తాన్ బార్డర్‌లోని టీటీపీ స్థావరాలు లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది.