Pakistan Crisis పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సమస్యను అధిగమించేందుకు దాయాది పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో షెహబాజ్ షరీఫ్ సర్కారు వెంటనే లీటర్ పెట్రోల్‌పై ధరలను తగ్గించింది. గురువారం ఇంధన ధరలు పెంచగా.. 24 గంటల్లోనే దానిని సమీక్షించింది. దీంతో ధరలు కాస్త తగ్గించడంతో సామాన్యులకు కొంత మేర ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత నుంచి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ మొత్తాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేస్తోంది. దాంతో పలు దేశాలను చమురు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను భారీగా పెంచేస్తుండటంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్.. చమురు ధరలు పెంచడంతో ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోంది. విమర్శలు, వ్యతిరేకత వ్యక్తకావడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ధరల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని ప్రభుత్వం రాత్రికి రాత్రే లీటర్ పెట్రోల్‌పై 80 పాకిస్థానీ రూపాయలు తగ్గించింది.
గురువారమే పాక్ సర్కారు పెట్రోల్‌పై 43 శాతం, హైస్పీడ్ డీజిల్ (HSD)పై 55 శాతం ధరలను పెంచింది. ఈ పెంపుతో పెట్రోల్ లీటరు 458 పాకిస్థానీ రూపాయలకు, డీజిల్ 520 పీకేఆర్‌కు చేరింది. ఇది ప్రజాగ్రహానికి దారితీసింది. పాక్ ప్రభుత్వంపై సామాన్యులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ శుక్రవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇంధన ధరల తగ్గింపు గురించి మాట్లాడుతూ.. పెట్రోల్‌పై 80 రూపాయలు తగ్గిస్తున్నామని, దాంతో లీటర్ 378 పీకేఆర్‌లకే లభిస్తుందని చెప్పారు.
కనీసం నెల రోజుల పాటు ఈ ధరలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులే పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణమని ఆయన అంగీకరించారు. కానీ, ధరలను నియంత్రించేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతోందని చెప్పారు. హెచ్‌ఎస్‌డీ డీజిల్‌పై కూడా లెవీని తొలగించింది. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన నాలుగు రోజులకే పాకిస్థాన్ పెట్రోల్, డీజిల్ ధరలను 20 శాతం మేర పెంచింది. గురువారం దాన్ని రెట్టింపు చేసి ప్రజలపై మరింత భారం వేసింది.
ఇక, దేశంలో ఇంధన పొదుపునకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆఫీసు పనిదినాలను వారానికి నాలుగు రోజులకు కుదించింది. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడమే కాకుండా ఆన్‌లైన్ తరగతులకు కూడా మార్చారు. అధిక పేదరికం ఉన్న పాకిస్థాన్ వంటి దేశాలకు ధరల పెరుగుదల ఆహార సంక్షోభానికి దారితీస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్.. ఐఎంఎఫ్ నుంచి భారీగా రుణాలను తీసుకుంది. ఇందుకోసం ఆ సంస్థ విధించే షరతులకు తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఇంధన ధరల పెంపు, పన్నుల భారం వంటి నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని ఐఎంఎఫ్ ఖరాఖండిగా చెప్పడంతో పాక్‌కు మరో గత్యంతరం లేకుండా పోయింది.
