Site icon HashtagU Telugu

Trash Balloons: మళ్లీ ఉత్తర కొరియా చెత్త బెలూన్లు..ఈసారి ఎక్కడ పడ్డాయంటే.. ?

North Korea Trash Balloons

Trash Balloons: చెత్త బెలూన్ల యుద్ధం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య వేడిని పుట్టిస్తోంది. తాజాగా  ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్లు సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం ప్రాగణంలో పడ్డాయి. ఈమేరకు ఆ దేశ మీడియాలో కథనాలు వచ్చాయి. బుధవారం ఉదయం ఉత్తర కొరియా(North Korea) చెత్త బెలూన్లను తమ దేశంపైకి వదిలిందని దక్షిణ కొరియా ఆర్మీ వెల్లడించింది.  అవి తమ దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజధాని సియోల్ నగరానికి ఉత్తరం వైపుగా ఎగిరాయని తెలిపింది. బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అయితే ఈ చెత్త బెలూన్ల వల్ల ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా ఆర్మీ స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య చెత్త బెలూన్ల(Trash Balloons) వార్ మే నెలాఖరు నుంచి కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా బుధవారం రోజు ఉత్తర కొరియా చెత్త బెలూన్లను పంపడం ఇది పదోసారి అని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఇప్పటిదాకా దాదాపు 2,000 కంటే ఎక్కువ బెలూన్లను ఉత్తర కొరియా ప్రయోగించిందని పేర్కొంది. వాటిలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణకొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే చెత్త బెలూన్లను పంపడం మళ్లీ ప్రారంభించామని ఉత్తర కొరియా వాదిస్తోంది.

Also Read :August Festivals – 2024 : రాఖీ, కృష్ణాష్టమి, నాగపంచమి..ఆగస్టులో వచ్చే పండుగలివే

ఉత్తర కొరియా చెత్త బెలూన్లకు గతంలో దక్షిణ కొరియా బలంగా బదులిచ్చింది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్‌ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం వినిపించింది.  విదేశీ వార్తలను ప్రసారం చేసింది. ఉత్తర కొరియా వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తించింది. ఇలా ఎందుకు చేసిందంటే.. ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు వినడం, K-పాప్‌ సంగీతాన్ని వినడం పెద్ద నేరాలు. వాటిని వింటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావాలు ఏర్పడుతాయని ఉత్తర కొరియా  సర్కారు నమ్ముతోంది. అందుకే ఆ వార్తలు, ఆ సంగీతం వినకుండా ప్రజలను నిలువరిస్తోంది. 2015 సంవత్సరంలోనూ బార్డర్‌లో ఇదే విధంగా దక్షిణ కొరియా ఆర్మీ లౌడ్‌ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా.. ఉత్తర కొరియా ఘాటుగా స్పందించింది. కిమ్‌ ప్రభుత్వం ఫిరంగులను పేల్చి బదులిచ్చింది. దీంతో అప్పట్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి  దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Also Read :Credit Cards : ఈ క్రెడిట్ కార్డులతో ఆదాయపు పన్ను చెల్లిస్తే రివార్డ్స్

Exit mobile version