Nepal Floods : వరదలతో నేపాల్ అతలాకుతలం అవుతోంది. వరదలకు సంబంధించిన వేర్వేరు ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 112కు పెరిగింది. చనిపోయిన వారిలో సగం మంది ఖాట్మండు లోయ వాస్తవ్యులే అని తెలిసింది. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. వారంతా వరదల్లో కొట్టుకుపోయారు. ఒక్క ఖాట్మండు లోయలోనే దాదాపు 30 మంది ఆచూకీ దొరకడం లేదు. ఈవివరాలను నేపాల్ సాయుధ దళాలు(Nepal Floods) వెల్లడించాయి. రెస్క్యూ టీమ్స్ సాహసోపేతంగా వ్యవహరించి పలుచోట్ల దాదాపు 3,000 మందిని వరదల్లో కొట్టుకుపోకుండా కాపాడారని తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో దేశవ్యాప్తంగా 63 ప్రాంతాల్లో ప్రధాన రహదారులను బ్లాక్ చేయాల్సి వచ్చిందన్నారు.
Also Read :Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హత్యపై యూఎన్‌కు ఇరాన్.. ఇజ్రాయెల్ తప్పేం లేదన్న అమెరికా
కుండపోత వర్షాల కారణంగా నేపాల్‌లో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడి బీభత్సం క్రియేట్ చేశాయి. దీంతో కొండ ప్రాంతాల్లోని చాలా రహదారులు మూసుకుపోయాయి. వాటి మీదుగా రాకపోకలు స్తంభించాయి. నిత్యావసరాలు సకాలంలో సరఫరా కాక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వరదల పరిస్థితిపై సమీక్షించేందుకు తాత్కాలిక ప్రధాన మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ మాన్ సింగ్, హోం మంత్రి, హోం కార్యదర్శి, భద్రతా సంస్థల చీఫ్‌లు, పలువురు మంత్రులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. నేపాల్‌లోని అన్ని పాఠశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరీక్షలను నిలిపివేయాలని నిర్దేశించారు. వరదల కారణంగా నేపాల్‌లోని ప్రధాన విద్యుత్ సరఫరా లైన్లకు అంతరాయం వాటిల్లింది. దీంతో ఖాట్మండులో విద్యుత్ సరఫరా కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. దేశ రాజధాని ఖాట్మండులో 226 ఇళ్లు నీటమునిగిపోయాయి. నేపాల్ పొరుగునే బిహార్ రాష్ట్రం ఉంది. దీంతో ఈ వరదల ప్రభావం బిహార్‌పై పడే అవకాశం ఉంది. నేపాల్ నుంచి కొన్ని నదులు నేరుగా బిహార్‌లోకి ప్రవహిస్తుంటాయి. ఆ నదుల నుంచి పోటెత్తే వరదలు రాష్ట్రంలోని పలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.