తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?

అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్‌ను భారత్ సంకెళ్లలో బంధిస్తుందని ఖలీదా జియా ఆరోపించారు.

Published By: HashtagU Telugu Desk
PM Tariq Rahman

PM Tariq Rahman

PM Tariq Rahman: బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత తారిఖ్ రెహమాన్ కొత్త ప్రధాని కాబోతున్నారని స్పష్టమైంది. అయితే తారిఖ్ రెహమాన్ రాకతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు దగ్గరవుతారా లేక భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహాన్ని కోరుకుంటారా? అన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన అరికట్టగలరా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

తారిఖ్ పై ప్రజల విశ్వాసం

ఫిబ్రవరి 13, 2026న వెలువడిన ఫలితాల్లో ప్రజలు తారిఖ్ రెహమాన్‌కు పట్టం కట్టారు. ఆయన విజయం ఖాయం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. “ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకున్న నమ్మకాన్ని చూపుతోంది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుంది. మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల కోసం మీతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను” అని పేర్కొన్నారు.

Also Read: ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా.. నిబంధనల ఉల్లంఘనపై DGCA కఠిన చర్యలు!

గత చరిత్ర భారత్‌కు అనుకూలం కాదు

భారత్ ఇంతటి సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ తారిఖ్ రెహమాన్ అదే స్థాయిలో స్పందిస్తారా అన్నది అనుమానమే. ఎందుకంటే తారిఖ్, ఆయన తల్లి ఖలీదా జియా నేతృత్వంలోని BNP చరిత్ర ఎప్పుడూ భారత్‌కు అనుకూలంగా లేదు. దీనికి కొన్ని ఉదాహరణలు.

1991లో: అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్‌ను భారత్ సంకెళ్లలో బంధిస్తుందని ఖలీదా జియా ఆరోపించారు.

1972 ఒప్పందం: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన 1972 ఒప్పందాన్ని ఆమె వ్యతిరేకించారు.

ట్రాన్సిట్ హక్కులు: భారత ట్రక్కులు బంగ్లాదేశ్ మీదుగా వెళ్లడాన్ని ఆమె “భారత్ కి బానిసత్వం” అని అభివర్ణించారు.

ఉగ్రవాదం: ఖలీదా జియా హయాంలో భారత వ్యతిరేక సంస్థ ‘ఉల్ఫా’ (ULFA)కు ఆయుధాల అక్రమ రవాణాలో వెసులుబాటు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. 2004లో చిట్టగాంగ్ సరిహద్దులో 10 ట్రక్కుల ఆయుధాలు పట్టుబడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చైనా వైపు మొగ్గు?

17 ఏళ్ల లండన్ ప్రవాసం తర్వాత 2025 డిసెంబర్ 26న ఢాకా చేరుకున్న తారిఖ్ రెహమాన్ జనవరి 2026లో చైనా రాయబారి యావో వెన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ ‘వన్ చైనా పాలసీ’కి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే చైనాతో కొనసాగుతున్న 6 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులు, రక్షణ ఒప్పందాలను కొనసాగిస్తామని చెప్పడం ద్వారా తన ప్రాధాన్యతలను ముందే సూచించారు.

విదేశాంగ విధానంలో సమతుల్యత సాధ్యమేనా?

చైనా వైపు మొగ్గు చూపినప్పటికీ భారత్‌ను పూర్తిగా విస్మరించడం తారిఖ్‌కు అంత సులభం కాదు. ఖలీదా జియా మరణించినప్పుడు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేయడం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఢాకాకు వెళ్లి తారిఖ్‌ను పలకరించడం వంటి పరిణామాలు ఇరు దేశాల మధ్య మంచును కరిగించే ప్రయత్నాలుగా చూడవచ్చు. మరోవైపు మొహమ్మద్ యూనస్ హయాంలో చైనా బంగ్లాదేశ్‌లో లోతుగా పాతుకుపోయింది. బంగ్లాదేశ్‌కు చైనా అతిపెద్ద వ్యాపార భాగస్వామి మాత్రమే కాదు, భారీ పెట్టుబడిదారు కూడా.

  Last Updated: 13 Feb 2026, 09:47 PM IST