US Gun Violence : అమెరికాలో మళ్లీ ఓ దారుణమైన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మోంటానా రాష్ట్రంలోని శాంతమైన పట్టణంగా పేరున్న అనకొండ నగరం ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. శుక్రవారం రాత్రి, ఓ బార్‌లో అర్ధరాత్రి సమయంలో జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం, పట్టణ వాసులను తీవ్ర ఉలిక్కిపాటుకు గురిచేసింది. మోంటానాలో ఇటీవలి కాలంలో ఇదే భీకరమైన ఘటనగా పోలీసులు పేర్కొన్నారు.
ఈ సంఘటన అనకొండ పట్టణంలోని ‘ది అవుల్ బార్’ అనే ప్రదేశంలో చోటుచేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో, కొద్దిపాటి సందడిలో ఉన్న బార్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి, అకస్మాత్తుగా తుపాకితో విచక్షణలేని కాల్పులు జరిపాడు. కాల్పుల ధ్వనితో బార్ పరిసర ప్రాంతం ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. అక్కడున్న పలువురు పరుగులు తీయగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు మైఖేల్ పాల్ బ్రౌన్ అనే వ్యక్తి. అతడు ప్రస్తుతం ప్రమాదకరమైన ఆయుధంతో పాటు పరారీలో ఉన్నట్లు అనకొండ-డీర్ లాడ్జ్ కౌంటీ అధికారులు తెలిపారు. అతని ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుతూ, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అతన్ని ఎక్కడైనా చూసినవారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ విజ్ఞప్తి చేశారు.
Odisha : మూత్రాన్ని వాటర్ అనుకోని తాగిన అధికారి..అసలు ఏంజరిగిందంటే !!
ఈ ఘటన తరువాత పోలీసులు అనకొండ పశ్చిమ ప్రాంతంలోని స్టంప్‌టౌన్ రోడ్, అండర్సన్ రాంచ్ లూప్ రోడ్ వంటి ప్రాంతాల్లో భారీగా మోహరించారు. హైవే పట్రోల్ విభాగం ప్రజలకు ఆ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. నిందితుడిని పట్టుకునే పనిలో పోలీస్, ఫెడరల్ ఏజెన్సీలు బిజీగా ఉన్నాయి.
ఈ వార్త తెలిసిన వెంటనే అనకొండ పట్టణ వాసులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. బిజినెస్ ఓనర్లు తక్షణమే తమ షాపులను మూసివేసి, లోపల ఉన్న కస్టమర్లను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. “ఇక్కడ తుపాకులు చాలా మందికి ఉంటాయి, అది మామూలే. కానీ ఇలా మా ఊరంతా లాక్‌డౌన్ అవడం భయానకంగా ఉంది” అని ఓ కేఫ్ యజమాని బార్బీ నెల్సన్ స్థానిక మీడియాతో చెప్పారు.
ఘటనాస్థలికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ నర్సరీ స్కూల్ యాజమాన్యం, పిల్లలను బయటకు పంపకుండా, స్కూల్ ప్రాంగణంలోనే ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. స్కూల్ స్టాఫ్ కూడా అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటానికి అలర్ట్ అయింది.
మోంటానా మామూలుగా అమెరికాలో అత్యంత నిశ్శబ్దంగా, సురక్షితంగా ఉండే రాష్ట్రాల్లో ఒకటి. ఇలాంటి ప్రాంతంలో ఈ విధంగా నిర్దిష్ట లక్ష్యం లేకుండా జరిపిన కాల్పులు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ముఖ్యంగా నిందితుడు ఇంకా పట్టుబడకపోవడం వల్ల పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది.
ప్రస్తుతం అనకొండ పట్టణం ఆందోళన వాతావరణంలో ఉంది. పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేస్తూ, ప్రజలకు భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కాల్పుల ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.
palm scan payments : నో యూపీఐ, నో కార్డ్స్.. అరచేతి స్కాన్‌తో నగదు చెల్లింపులు..ఎక్కడంటే?