Site icon HashtagU Telugu

Air India Plane: ఎయిరిండియా విమానానికి త‌ప్పిన పెను ప్ర‌మాదం!

Plane Emergency Landing

Plane Emergency Landing

Air India Plane: ఇజ్రాయెల్‌లోని తెల్ అవీవ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన క్షిపణి దాడి భారత విమానంపై కూడా ప్రభావం చూపింది. ఈ విమానాన్ని మళ్లించారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం (Air India Plane) ఢిల్లీ నుంచి తెల్ అవీవ్‌కు వెళ్తోంది. ఈ దాడి ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ AI139 తెల్ అవీవ్‌లో ల్యాండ్ అవ్వడానికి సుమారు ఒక గంట ముందు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విమానాన్ని అబుదాబికి మళ్లించారు.

ఎయిర్ ఇండియా విమానం మళ్లింపు

న్యూస్ ఏజెన్సీ పీటీఐ ద్వారా ఎయిర్ ఇండియా జారీ చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. “మే 4, 2025న ఢిల్లీ నుంచి తెల్ అవీవ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI139ను ఈ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటన అనంతరం అబుదాబి వైపు మళ్లించారు. ఈ ఫ్లైట్ అబుదాబిలో సాధారణంగా ల్యాండ్ అయింది. త్వరలో ఢిల్లీకి తిరిగి వస్తుంది.” అని పేర్కొంది. నివేదికల ప్రకారం విమానం జోర్డాన్ గగనతలంలో ఉన్నప్పుడు మళ్లింపు నిర్ణయం తీసుకుంది.

ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. మా కస్టమర్లు, సిబ్బంది భద్రతను నిర్ధారించేందుకు తెల్ అవీవ్ నుంచి వచ్చే, వెళ్లే విమానాలను మే 6, 2025 వరకు తక్షణమే నిలిపివేసినట్లు తెలిపారు. మా సిబ్బంది కస్టమర్లకు సహాయం చేస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సహకరిస్తున్నారని తెలిపారు.

Also Read: Dry Fruits: డయాబెటిస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ఆరుగురు గాయపడ్డారు

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌లోని తెల్ అవీవ్‌లో ఉన్న బెన్ గురియన్ విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు. దీంతో అక్కడి ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడినందున పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఇది నేరుగా విమానాశ్రయంపై పడి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది. ఈ దాడిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. యెమెన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకోలేకపోయారు. అది విమానాశ్రయానికి చాలా సమీపంలో పడింది. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు.