Site icon HashtagU Telugu

Microsoft 50th Anniversary : మైక్రోసాఫ్ట్‌కు 50 వసంతాలు.. బిల్‌గేట్స్ సమక్షంలో ఉద్యోగుల నిరసన.. ఎందుకు ?

Microsoft 50th Anniversary Vs Employees Mustafa Suleyman Bill Gates Ai Israel

Microsoft 50th Anniversary : మైక్రోసాఫ్ట్.. సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో రారాజు. ఈ దిగ్గజ ఐటీ కంపెనీ 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 1975 ఏప్రిల్‌ 4న అమెరికాలోని న్యూ మెక్సికో అల్బుకెర్కీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్‌ను చిన్ననాటి స్నేహితులైన బిల్‌ గేట్స్‌, పాల్‌ అలెన్‌ కలిసి స్థాపించారు. 1979లో ఈ కంపెనీ కార్యాలయాన్ని వాషింగ్టన్‌కు మార్చారు. ఆ తర్వాత గేట్స్‌, అలెన్‌తో పాటు స్టీవ్‌ బాల్మర్‌, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులతో బిల్‌గేట్స్  ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Also Read :Secret Island : భారత్‌కు చేరువలో అమెరికా – బ్రిటన్ సీక్రెట్ దీవి.. ఎందుకు ?

వేదికపై బిల్‌గేట్స్ ఉండగా.. 

మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం సీఈవో ముస్తఫా సులేమాన్‌ ప్రజెంటేషన్‌ ఇస్తుండగా.. పలువురు ఉద్యోగులు నిరసన తెలిపారు. గాజా, లెబనాన్‌లపై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్‌ మిలిటరీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏఐ టెక్నాలజీని అందించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన జరుగుతున్న సమయంలో వేదికపైనే బిల్‌గేట్స్‌, మాజీ సీఈఓ స్టీవ్ బామర్ కూర్చొని ఉన్నారు.

ముస్తఫా.. ఇది సిగ్గుచేటు చర్య

‘‘ముస్తఫా.. ఇది సిగ్గుచేటు చర్య. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తామని, ఆ దిశగా శ్రద్ధ వహిస్తామని చెప్తున్నారు. కానీ ఏఐ సాంకేతికతను ఇజ్రాయెల్‌ సైన్యానికి విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు గాజాలో 50 వేల మంది మరణించారు. మారణహోమానికి మైక్రోసాఫ్ట్ సహకరిస్తోంది. ఇది ఆపేయండి’’ అని ఒక మహిళా ఉద్యోగి కేకలు వేశారు. ఆమె నిరసన తెలుపుతూ వేదిక వైపుగా దూసుకెళ్లారు. దీంతో సులేమాన్ తన ప్రసంగాన్ని ఆపేశారు. ‘‘నేను మీ మాటలు వింటున్నా. థాంక్యూ’’ అని సీఈఓ బదులిచ్చారు. సదరు ఉద్యోగిని బయటకు పంపుతుండగా, ఆమె పాలస్తీనా వాసులకు మద్దతుగా ఉపయోగించే స్కార్ఫ్‌ను వేదికపైకి విసిరారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :Gachibowli Lands: తిరుగులేని దానం.. గచ్చిబౌలిలో 10 ఎకరాలు ఇచ్చేసిన యాక్టర్

బిల్‌గేట్స్ వీడియో సందేశం ఇదీ.. 

మైక్రోసాఫ్ట్(Microsoft 50th Anniversary) కంపెనీ 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా బిల్‌గేట్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మైక్రోసాఫ్ట్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంస్థ నాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. అందులో పలు ఇబ్బందికర ఫొటో షూట్లు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు నేను మళ్ళీ ఎప్పటికీ కూల్‌గా ఉండను. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో ఉన్న నేను, ఇప్పటి నేను ఒక్కటే’’ అని వీడియో సందేశంలో బిల్‌గేట్స్ పేర్కొన్నారు.