Site icon HashtagU Telugu

Leave America : ఆ ఫారిన్ స్టూడెంట్స్‌‌పై అమెరికా చర్యలు.. సంచలన ఈమెయిల్స్

Indian Students Visa Revocations Insta Like Social Media Leave America

Leave America : అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే.  ఇతర దేశాల స్టూడెంట్స్ కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నారు. వీరందరినీ ఇబ్బందిపెట్టే విధానాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో విదేశీ విద్యార్థుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను విధిస్తున్నారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక అమెరికాలోని విదేశీ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

విద్యార్థుల ఈ కార్యకలాపాలపై నిఘా.. 

  • సోషల్ మీడియాలో అమెరికా(Leave America)కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కారు ప్రత్యేక నిఘా పెట్టింది.
  • అమెరికా వ్యతిరేక సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టే వారిని, వాటిని లైక్ చేసే వారిని,  షేర్ చేసే వారిని గుర్తిస్తున్నారు.
  • యూనివర్సిటీ, కాలేజీ క్యాంపస్‌లలో అమెరికాకు, ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో పాల్గొనే విదేశీ విద్యార్థులనూ గుర్తిస్తున్నారు.
  • ఈ రకాల కార్యకలాపాల్లో భాగమయ్యే ఫారిన్ స్టూడెంట్స్‌కు అమెరికా విదేశాంగ శాఖ ఈ-మెయిల్స్ పంపుతోంది. అలాంటి వారి వీసా వివరాలను సమీక్షిస్తోంది.
  • ఎఫ్ (అకడమిక్), ఎం (ఒకేషనల్) లేదా జె (ఎక్స్ఛేంజ్) రకం వీసాలకు విదేశీ విద్యార్థులు అప్లై చేసినా అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా యాక్టివిటీని తనిఖీ చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేక భావజాలం ఉన్నవారికి ఛాన్స్ ఇవ్వడం లేదు.

విదేశీ స్టూడెంట్స్‌కు ఈమెయిల్స్‌లో ఏముంది ? 

పైన మనం చెప్పుకున్న ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఈమెయిల్స్ అందాయి. వాటిలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మీ ఎఫ్-1 వీసాను వెంటనే రద్దు చేశారు. దీని గురించి సంబంధిత ప్రభుత్వ విభాగం వారు మీ కాలేజీకి సమాచారాన్ని చేరవేస్తారు. చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ హోదా లేకుండా మీరు అమెరికాలో ఉండడం కొనసాగిస్తే జరిమానాలు, నిర్బంధం, బహిష్కరణ వంటి పరిణామాలు జరుగుతాయి. దీనివల్ల భవిష్యత్తులో మీకు అమెరికా వీసా లభించదు. అమెరికా బహిష్కరణకు గురయ్యే వ్యక్తులను వారి స్వదేశాలకే కాకుండా ఇతర దేశాలకూ పంపే అవకాశం ఉంటుంది. వీసా రద్దయిన వారు సీబీపీ హోం యాప్ ద్వారా అమెరికాను విడిచి వెళ్లాలనే తమ ఉద్దేశాన్ని వ్యక్తపర్చొచ్చు. మీరు అమెరికా నుంచి బయలుదేరిన వెంటనే పాస్ పోర్టును, వీసా జారీ చేసిన అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌కు వ్యక్తిగతంగా సమర్పించాలి. తద్వారా మీ వీసాను భౌతికంగా రద్దు చేయించవచ్చు. ఇక దాన్ని మీరు వాడొద్దు. భవిష్యత్తులో అమెరికాకు రావాలనుకుంటే అమెరికా వీసాకు అప్లై చేయాలి’’ అని సదరు ఈమెయిల్స్‌లో ఉంది.