Israel VS Iran : ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఇరాన్‌పై దాడి చేసే సమయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఈ దాడి కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి అమెరికాకు చెందిన రక్షణ శాఖ విభాగం పెంటగాన్ నుంచి కొన్ని డాక్యుమెంట్లు లీకయ్యాయి. అయితే వీటిని కావాలనే లీక్ చేశారా ? అనుకోకుండా లీకయ్యాయా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇరాన్‌కు తప్పుడు సమాచారాన్ని పాస్ చేసేందుకు ఆ డాక్యుమెంట్లను లీక్ చేసి ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయడమైతే ఖాయం. దాడికి సంబంధించిన వ్యూహం, ప్రణాళిక చివరి నిమిషంలో మారిపోయినా ఆశ్చర్యం లేదు. అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది మిస్సైళ్లతో దాడికి తెగబడింది. ఆ దాడి చేసినందుకు ఇరాన్ బాధపడేలా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అంటున్నారు. ఈనెల 22న బ్రిక్స్ కూటమి సదస్సు రష్యాలో జరగబోతోంది. దాని కంటే ముందే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కంటే కొన్ని రోజుల ముందు ఈ ప్రతీకార దాడి (Israel VS Iran) జరుగుతుందని మరికొందరు పేర్కొంటున్నారు.
Also Read :BRICS Vs US Dollar : అమెరికా డాలర్ వర్సెస్ బ్రిక్స్ కరెన్సీ.. పుతిన్ కీలక ప్రకటన
ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్లానింగ్‌తో ముడిపడిన రెండు కీలక ఫైళ్లు అమెరికాకు చెందిన పెంటగాన్ నుంచి లీకయ్యాయి. వీటిని ఇరాన్ అనుకూల ‘మిడిల్ ఈస్ట్ స్పెక్టేటర్’ గ్రూపు టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్టు చేసింది. ఇరాన్‌పై ప్రతీకార దాడి కోసం ఈనెల 15-16 తేదీల నుంచి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోందని ఆ ఫైళ్లలో ఉంది. సాధారణంగా పెంటగాన్ తయారు చేసే ఇలాంటి కీలకమైన ఇంటెలీజెన్స్ నివేదికలను కేవలం ఫైవ్ ఐస్ దేశాలతో మాత్రమే షేర్ చేస్తుంటారు. ఫైవ్ ఐస్ దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి.
Also Read :Kappatralla Forest : ‘యురేనియం’ రేడియేషన్ భయాలు.. కప్పట్రాళ్లలో కలవరం
ఇరాన్‌పై దాడి ఇలా..
- ఇరాన్‌పై దాడి కోసం ఇజ్రాయెల్ ప్రత్యేక ఆయుధాలను, యుద్ధ విమానాలను రెడీ చేసింది.
- యుద్ధ విమానాల నుంచి ఇరాన్‌లోని భూతల లక్ష్యాలపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించనున్నారు.
- ఈ దాడి కోసం కొన్ని మానవ రహిత విమానాలను కూడా ఇజ్రాయెల్ వినియోగించనుంది.
- ఇరాన్‌పై దాడి కోసం తమ యుద్ధ విమానాలతో పాటు రిఫ్యూయలింగ్ ట్యాంక్‌లను కూడా ఇజ్రాయెలీ ఆర్మీ పంపనుంది.