Site icon HashtagU Telugu

Lahore Blasts: లాహోర్‌లో బాంబుల మోత.. వరుస పేలుళ్లతో వణుకు

Lahore Blasts Explosions At Military Airport Pakistan India

Lahore Blasts: బుధవారం రోజు పాకిస్తాన్‌ను భారత సైన్యం వణికించింది. తాజాగా గురువారం రోజు పాకిస్తాన్‌లోని ముఖ్య నగరాల్లో ఒకటైన లాహోర్‌‌లో బాంబుల మోత మోగింది. ఈ  నగరంలోని చారిత్రక వాల్టన్ రోడ్‌లో ఉన్న మిలిటరీ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో  వరసగా మూడుసార్లు భారీ పేలుళ్లు సంభవించాయి. పేలినవి బాంబులేనని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ ఎయిర్‌పోర్టును కేవలం పాకిస్తాన్ వాయుసేన అవసరాలకు వాడుతున్నట్లు తెలిసింది. పాకిస్తాన్ వాయుసేన శిక్షణ కార్యక్రమాలు జరుగుతుండగా ఈ పేలుళ్లు జరిగాయని పాక్ సైనిక వర్గాలు తెలిపాయంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి.  లాహోర్‌లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. డ్రోన్ దాడి జరిగినందు వల్లే పేలుడు జరిగి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకైతే ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు.

Also Read :India Vs Pakistan : బార్డర్‌లో ఉద్రిక్తత.. అమరుడైన జవాన్.. 15 మంది సామాన్యులు మృతి

పేలుళ్ల వీడియోలు వైరల్.. 

లాహోర్‌లోని(Lahore Blasts) మిలిటరీ ఎయిర్‌పోర్టులో పేలుడు జరిగి భారీ పొగలు వెలువడుతున్నట్టుగా.. వాటిని చూసి పరిసర ప్రాంతాల ప్రజలు పరుగులు తీస్తున్నట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో హుటాహుటిన లాహోర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. కరాచీ, సియాల్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లను కూడా మూసివేయడం గమనార్హం.  అయితే ఈ పేలుళ్లు ఎలా జరిగాయి ?  దీని వెనుక ఎవరున్నారు ? బెలూచిస్తాన్ వేర్పాటువాదులు లేదా తాలిబన్ అనుకూల మిలిటెంట్లు పేల్చారా ? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఉండేది లాహోర్‌లోనే.. 

లాహోర్ నగరంలో ఎంతోమంది కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. ప్రత్యేకించి లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ అధిపతి హఫీజ్ సయీద్ ఇదే నగరంలో ఉంటాడు. అతడికి పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు భారీ సెక్యూరిటీ కల్పిస్తుంటారు. భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు.