Kamala Harris Vs Putin : అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ గత రెండేళ్లుగా తీవ్రరూపు దాల్చింది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. రష్యా అధ్యక్షుడిగా ఉండేవాళ్ల నుంచి పెనుసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికా, రష్యాల అధ్యక్షులుగా ఉండేవారు పోటాపోటీగా వ్యూహ,ప్రతివ్యూహాలను రచిస్తుంటారు. ఈ రెండు దేశాలు ఒకదాన్నొకటి సైనిక శక్తిపరంగా దాటేసేందుకు నిత్యం యత్నిస్తుంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ రెండింటిలో ఏదో ఒక దాని వైపు ఉంటూ, తమతమ ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతాయి. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై(Kamala Harris Vs Putin) కీలక కామెంట్స్ చేశారు.
Also Read :Pithapuram : పవన్ ఇలాకాలో దారుణం.. బాలికకు మద్యం తాగించి అత్యాచారం
‘‘నేను ఈ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షురాలిగా అయితే అమెరికా ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తాను. పుతిన్‌ను కలిసే ప్రసక్తే లేదు. ఒకవేళ రష్యా – ఉక్రెయిన్ శాంతి చర్చలకు హాజరైనా పుతిన్‌ను మాత్రం అస్సలు కలవను’’ అని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ భవిష్యత్తు గురించి ఆ దేశమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు స్పష్టమైన వైఖరి లేదని ఆమె మండిపడ్డారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో, పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించే విషయంలో తనకు పూర్తి క్లారిటీ ఉందని కమల చెప్పుకొచ్చారు. ట్రంప్ పూర్తిగా పుతిన్‌కు అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ప్రకటించారు. తన సోషల్ మీడియా కంపెనీ ఎక్స్ ద్వారా ట్రంప్‌ను మస్క్ బాగానే ప్రమోట్ చేస్తున్నారు.