Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో కీలక ఫలితాలు వచ్చాయి. ఓ వైపు అమెరికాలో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ మొదలైన తరుణంలో వెలువడిన ఈ ఫలితాలు అందరి చూపును తమ వైపు తిప్పుకున్నాయి. చికాగో యూనివర్సిటీలో ఎన్‌ఓఆర్‌సీ నిర్వహించిన సర్వేకు సంబంధించిన వివరాలివీ..
Also Read :Kamala Harris : అమెరికాలో కలకలం.. కమలా హ్యారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు
అమెరికాలో ఆసియన్ అమెరికన్లు ఎక్కువ. వీరంతా ఆసియా ప్రాంత దేశాల నుంచి వలస వెళ్లి అమెరికాలో ఉంటున్నవారు. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఎంతో మంది ఆసియన్ అమెరికన్లు అగ్రరాజ్యానికి వెళ్లారు. ఆసియన్ అమెరికన్ ఓటర్లను ఇటీవలే సర్వే చేయగా వారిలో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌కే మద్దతు ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కేటగిరీకి చెందిన ఓటర్లలో అత్యధికులు ఆమెకే(Kamala Harris) జై కొట్టారు. దీంతో సర్వేలో 38 పాయింట్లతో కమలా హ్యారిస్ ముందంజలో నిలిచారు. ఈ పరిణామం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌కు షాక్ ఇచ్చేదే అని చెప్పొచ్చు.
Also Read :Encounters: 13,000 ఎన్ కౌంటర్లు.. 27,000 మంది అరెస్ట్, ఎక్కడంటే..?
ఆసియన్ అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది కమలకు మద్దతు ఇస్తామని చెప్పగా.. 28 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు ఓటు వేస్తామన్నారు. బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు నిర్వహించిన సర్వేలో 46 శాతం మంది ఆసియన్ అమెరికన్లు బైడెన్‌కు మద్దతు పలికారు. అంటే కమలను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత డెమొక్రటిక్ పార్టీ బలంగా గణనీయంగా పెరిగిందన్న మాట. నవంబరు నెల 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ఇటీవలే మొదలైంది. ఈనెలాఖరు వరకు అది కొనసాగనుంది.