Jordan Air Force : జోర్డాన్ వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి ఆదివారం అర్ధరాత్రి గాజాలోకి ఎంటర్ అయింది. అదేదో ఇజ్రాయెల్ దళాలను ఎదుర్కోవడానికి కాదు.. గాజాలోని ప్రజలకు అవసరమైన వైద్య సామగ్రిని చేరవేయడానికి! గాజాలో జోర్డాన్‌కు చెందిన ఫీల్డ్ ఆస్పత్రి ఒకటి ఉంది. దానికి అవసరమైన అత్యవసర వైద్య సామగ్రి, ఔషధాలను చేరవేసేందుకు జోర్డాన్ సర్కారు ఒక ప్రత్యేక విమానాన్ని పంపింది. ఆ విమానం ద్వారా వైద్యసామగ్రిని గగనతలం నుంచి గాజా భూభాగంపైకి సురక్షితంగా జారవిడిచారు. ఈవిషయాన్ని జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II సోమవారం తెల్లవారుజామున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తూ గాయపడిన మా సోదరులు, సోదరీమణులకు సహాయం చేయడం మా కర్తవ్యం. మా పాలస్తీనా సోదరులకు మేం ఎల్లప్పుడూ అండగా ఉంటాం’’ అని జోర్డాన్ కింగ్ స్పష్టం చేశారు. అయితే ఈ సహాయక సామగ్రి ఆస్పత్రికి చేరుకుందా ? లేదా ?.. ఇజ్రాయెల్‌కు చెప్పే జోర్డాన్ ఈ ఆపరేషన్ చేసిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. గతంలో ఇలా పొరుగుదేశాలు విమానాల ద్వారా వైద్య సామగ్రిని గాజాకు చేరవేసిన సందర్భాల్లో ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ టెర్రర్ గ్రూప్‌కు ఆయుధాలు లేదా రక్షణ పరికరాలను అక్రమంగా చేరవేసే ముప్పు ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈసారి దీనిపై ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచిచూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
గాజాలోకి చొరబడిన ఇజ్రాయెల్ సైన్యం ఆ ప్రాంతాన్ని రెండుగా(ఉత్తర గాజా, దక్షిణ గాజా) వేరు చేసుకొని దాడులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలోని దాదాపు 11వేల మంది సామాన్య పౌరులు చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. నాలుగు వారాల నుంచి కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజా ప్రజల జీవితం దుర్భరంగా మారింది. తిండికి, నీటికి కూడా ప్రజలు విలవిలలాడుతున్నారు. కాల్పులు విరమణ చేయాలని అరబ్ దేశాలు చేసిన ప్రతిపాదనకు అమెరికా నో చెప్పింది. అలా చేస్తే హమాస్ శక్తియుక్తులను కూడగట్టుకొని ఇజ్రాయెల్‌పై మళ్లీ దాడి చేస్తుందని అగ్రరాజ్యం(Jordan Air Force) వాదిస్తోంది.