US : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న తరుణంలో దేశంలో ఏదైనా భయంకరమైన విషాదం జరిగితే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సుదీర్ఘ చర్చకు దారి తీశాయి. ‘యూఎస్ టుడే’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ..ట్రంప్ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేస్తున్నవారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవారే. అయినా వాళ్లందరి కంటే ఎక్కువ పనిచేసే నలుగురు నాయకుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు అని తెలిపారు. ట్రంప్ రోజు ఉదయాన్నే లేచి, ఆలస్యంగా నిద్రపోతారని, ఆయన ఉత్సాహం నిరంతరం మిగతా సభ్యులను మించినదని వర్ణించారు. మనకు తెలియని పరిస్థితుల్లో, కొన్ని భయంకరమైన విషాదాలు దేశాన్ని వణికించే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో అమెరికా నాయకత్వానికి గట్టి ఆదరణ అవసరం. అటువంటి సమయంలో, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు.
ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు
ఇటీవలి కాలంలో ట్రంప్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు బయటపడ్డాయి. అమెరికా అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేస్తున్న ట్రంప్‌కు సిరల వ్యాధి (Peripheral Vascular Disease) ఉందని వైద్య నివేదికలు తెలిపాయి. ఇది 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణంగా కనిపించే రక్తప్రసరణ సమస్యగా వైట్ హౌస్ ప్రకటించింది. అయినా కూడా, ఈ ఆరోగ్య సమస్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మా ఉద్యమం మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ (మాగా) దీర్ఘకాలిక దృష్టితో నడుస్తోంది. జేడీ వాన్స్ ఈ ఉద్యమానికి సరైన వారసుడు కావచ్చు. అలాగే విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇందులో పాత్ర పోషించవచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టినప్పటికీ, 2028లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ వేదికగా వాన్స్ పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన యువతలో మంచి ఆదరణ పొందుతున్నారు. రాజకీయంగా ధైర్యంగా మాట్లాడే నాయకుడిగా ఆయన మన్ననలు పొందుతున్నారు. జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపాయి. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్ నాయకత్వంపై అభిప్రాయాలు వస్తున్న తరుణంలో, వాన్స్ తనను సిద్ధంగా ఉంచుతున్నానన్న ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రిపబ్లికన్ పార్టీలో ఆయన పాత్ర మరింత బలపడుతుందా? 2028 ఎన్నికల్లో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అనేదానిపై దృష్టి కేంద్రీకృతమవుతోంది.
Read Also: PM Modi : జపాన్‌లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ