Site icon HashtagU Telugu

JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ అల్లుడే..!!

Jd Vance

Jd Vance

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహారిగా సాగిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి (Republican presidential candidate) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) , డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లు హోరా జరుగగా..విజయం మాత్రం ట్రంప్‌ నే వరించింది. మ్యాజిక్ ఫిగర్ 270 దాటి విజయం అందుకున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం తో ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులు , బిజినెస్ ప్రముఖులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ (JD Vance) ఎవరో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉషా చిలుకూరి (Usha Chilukuri Vance) భర్తే. మన తెలుగు రాష్ట్రానికి చెందిన అల్లుడే అగ్రరాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. దీంతో ఉషా చిలుకూరి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత ఎన్నికల్లో జో బైడెన్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన కమలా హారిస్ మూలాలు ఇండియాకు చెందినవి అని తెలిసి అంతా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారనే వార్త తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత గర్వపడుతున్నారు. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడి.. దేశం గర్వించే స్థాయికి ఎదిగిన ఉష పూర్వీకుల మూలాలు కష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉండగా.. విశాఖపట్నంలోనూ ఆమెకు బంధువులున్నారు. వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ సి శాంతమ్మ (96)కు ఉష మనవరాలు వరుస అవుతారు. శాంతమ్మ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి ద్వారా ఉషతో తనకు కుటుంబ సంబంధం ఉందని, ఆమె తనకు మనవరాలు అవుతుందని శాంతమ్మ పేర్కొన్నారు. ఐఐటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన తన మరిది రామశాస్త్రి మనవరాలే ఆమె’ అని శాంతమ్మ తెలిపారు. రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. వారు శాన్‌ డియాగోలో ఇంజనీరింగ్‌, మాలిక్యులర్‌ బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తే ఉషా చిలుకూరి. ఆమె భర్త జేడీ వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. యేల్ విశ్వవిద్యాలయంలోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్ గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు.

Read Also : US President Earn : అమెరికా అధ్యక్షుడి ఏడాది వేతనం ఎంతో తెలుసా..?