Site icon HashtagU Telugu

Japan Marriages : పెళ్లి కాని యువతులకు గుడ్ న్యూస్.. జపాన్ సరికొత్త స్కీమ్

Japan Marriages Tokyo

Japan Marriages : జపాన్ అంటేనే విప్లవాత్మక నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్.  దేశ ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఎలాంటి నిర్ణయాలను తీసుకునేందుకైనా జపాన్ ప్రభుత్వాలు వెనుకాడవు. తాజాగా జపాన్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చాలామంది జపాన్ యువతులు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిని చూపించడం లేదు. దీంతో అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతోంది. ఈనేపథ్యంలో అలాంటి యువతుల కోసం ఒక సరికొత్త స్కీంను జపాన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాజధాని టోక్యో ప్రాంతంలోని అవివాహిత యువతులు .. దేశంలోని ఏవైనా గ్రామాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటే ఆర్థికసాయాన్ని అందిస్తామని సర్కారు ప్రకటించింది. పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి అయ్యే ఖర్చులను కూడా చెల్లిస్తామని తెలిపింది. పెళ్లి జరిగాక పర్మినెంటుగా ఆయా పల్లెల్లోనే స్థిరపడాలని భావిస్తే.. అదనంగా మరింత ఆర్థికసాయాన్ని కూడా సమకూరుస్తామని వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఈ స్కీం అమల్లోకి వస్తుందని జపాన్ ప్రభుత్వం(Japan Marriages) అనౌన్స్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

జపాన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో పెద్ద కారణం కూడా ఉంది. అదేమిటంటే.. జపాన్‌లోని పల్లె ప్రాంతాలకు చెందిన చాలామంది యువతులు చదువులు, ఉద్యోగాల కోసం రాజధాని టోక్యో ప్రాంతానికి వలస వస్తున్నారు. వారు టోక్యోకు వచ్చాక.. అక్కడే ఉండిపోతున్నారు. మళ్లీ సొంతూళ్లకు వెళ్లడం లేదు. ఇలా టోక్యోలో ఉండిపోతున్న యువతుల్లో చాలామంది పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదు. సర్వేలలో ఈ అంశాలను గుర్తించబట్టే.. వారికి పెళ్లిళ్లు చేయడంతో పాటు టోక్యో నుంచి దూరంగా పంపేందుకు జపాన్ ప్రభుత్వం ఈ కొత్త స్కీంను ప్రకటించింది. దేశ యువతుల్లో ఎక్కువ మంది నగరాలలోనే ఉన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల నిష్పత్తి బాగా తగ్గిపోయింది. కొత్త ప్రభుత్వ స్కీం ద్వారా లబ్ధిపొందేందుకు జపాన్ యువతులు మళ్లీ పల్లెటూళ్లకు వెళ్లిపోతారని అంచనా వేస్తున్నారు. ఫలితంగా టోక్యోపై జనాభా ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read :Student Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా వృద్ధి రేటును మించిపోయాయ్