Hassan Nasrallah : లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాకు కోలుకోలేని షాక్ తగిలింది. రాజధాని బీరుట్‌లో దక్షిణ భాగం శివారు ప్రాంతాలపై ఇజ్రాయెలీ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యారు. ఈవిషయాన్ని హిజ్బుల్లా ధ్రువీకరించనప్పటికీ.. ఇజ్రాయెలీ ఆర్మీ మాత్రం దీనిపై ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షోషానీ ఈవివరాలతో ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రోజు బీరుట్‌పై జరిగిన దాడుల్లోనే హసన్ నస్రల్లా హతమయ్యారని ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన మరో అధికార ప్రతినిధి కెప్టెన్ డేవిడ్ అబ్రహం(Hassan Nasrallah) తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఆయన ఈవివరాలను తెలియజేశారు. ప్రపంచాన్ని ఇక హసన్ నస్రల్లా భయభ్రాంతులకు గురి చేయలేరని డేవిడ్ అబ్రహం వ్యాఖ్యానించారు.
హిజ్బుల్లాకు చెందిన ఓ నాయకుడు ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం నుంచి హసన్ నస్రల్లా తమతో టచ్‌లో లేరని వెల్లడించారు. హిజ్బుల్లా వైపు నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈవిషయంపై క్లారిటీ రాదని అంటున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ యుద్ధ విమానాలు బీరుట్ నగరంపై జరిపిన బాంబు దాడుల్లో హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా చనిపోయారు. ఈవిషయాన్ని హిజ్బుల్లా వర్గాలు ధ్రువీకరించాయి. 1997లో ఇజ్రాయెల్ ఆర్మీతో జరిగిన యుద్ధంలో హసన్ నస్రల్లా సోదరుడు హాదీ కూడా ప్రాణాలు కోల్పోయారు. హసన్ నస్రల్లా కుటుంబం నుంచి ఇలా చాలా మంది లెబనాన్ కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. వీరి మరణాల నేపథ్యంలో హిజ్బుల్లా ఎలా స్పందిస్తుంది ? హిజ్బుల్లా పగ్గాలను ఎవరు చేపడతారు ? అనేది ఆసక్తికరంగా మారింది. హసన్ నస్రల్లా మరణం నేపథ్యంలో ఇరాన్ స్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.