Pakistan : మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతోంది. ఇజ్రాయిల్–ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రతీకార దాడులు ఇతర ముస్లింలదేశాల ఆందోళనకు కారణమవుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్ అణు స్థావరాలపై మాస్ వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయిల్‌పై ఎదురు దాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇజ్రాయిల్ చర్యలను మొత్తం ముస్లిం ప్రపంచంపై నడిపిస్తున్న “క్రూసేడ్”గా అభివర్ణిస్తూ, గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ తర్వాత తమ దేశమే లక్ష్యంగా మారుతుందన్న భయం పెరుగుతోంది.
ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ అసద్ కైజర్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. “ఇజ్రాయిల్ తదుపరి టార్గెట్ పాకిస్తాన్ కావచ్చు. భారత్–ఇజ్రాయిల్ మధ్య బలమైన సైనిక సహకారం మన దేశ భద్రతకు పెద్ద ముప్పు” అని ఆయన హెచ్చరించారు. భారత్–పాకిస్తాన్ మధ్య గతంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో భారత దళాలు వాడిన డ్రోన్లు, ఆయుధాల లోతైన భాగం ఇజ్రాయెల్ నుంచి వచ్చినవే అని తెలిపారు.
ఇరాన్‌తో పాకిస్తాన్‌కి సరిహద్దులు ఉన్నందున, ఇజ్రాయిల్ వారి భద్రతాపరమైన కారణాలను చూపి, తమపై కూడా దాడికి దిగే అవకాశాన్ని ఆ ఎంపీ ఖండించారు. అదే సమయంలో ఇజ్రాయిల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలవాలంటూ తమ ప్రభుత్వాన్ని కోరారు.
ఇరాన్ అణ్వాయుధాల నిర్మాణంపై అనుమానంతో, ఇజ్రాయిల్ శుక్రవారం తెల్లవారుజామున టెహ్రాన్ సహా పలు ఇరాన్ నగరాలపై తీవ్రమైన వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో IRGC చీఫ్ హోస్సేన్ సలామి, కమాండర్ గులామ్ అలీ రషీద్, అణు శాస్త్రవేత్తలు డాక్టర్ మొహమ్మద్ టెహ్రాన్చి, డాక్టర్ ఫెరేడూన్ అబ్బాసి, సాయుధ దళాల చీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరి సహా పలు ప్రముఖులు హతమయ్యారు. అదే రాత్రి ఇరాన్ కూడా శక్తిమంతమైన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయిల్‌ను లక్ష్యంగా చేసుకుని భీకర ప్రతీకార దాడులు చేపట్టింది. ఫలితంగా మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని తీవ్ర ఉద్రిక్తత ముంచెత్తింది.