Israel – Hamas Deal : దాదాపు 14వేల మంది పాలస్తీనా పౌరుల మరణాలు సంభవించిన తర్వాత ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కుదిరిన డీల్ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఇజ్రాయెల్, పాలస్తీీనా మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ – హమాస్ మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతర్ దేశం ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తొలి విడతగా 13 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ రిలీజ్ చేస్తుందని వెల్లడించింది. వీరిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలు, ముసలివారే ఉంటారని పేర్కొంది. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కూడా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. హమాస్ తాము విడుదల చేయనున్న 50 మంది ఇజ్రాయెలీ బందీల జాబితాను ఇజ్రాయెల్‌కు ఇప్పటికే అందించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న దాదాపు 150 మంది పాలస్తీనా ఖైైదీలను కూడా నేటి నుంచి నాలుగు రోజుల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వారి లిస్టును హమాస్ ప్రతినిధులకు అందించింది. ఈ ఒప్పందంలో భాగంగా నాలుగు రోజుల పాటు గాజాలోకి ప్రతిరోజూ 200 మానవతా సహాయక ట్రక్కులు, 4 ఇంధన ట్రక్కులు ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందంలోని నాలుగో రోజున (సోమవారం) మిగతా ఇజ్రాయెలీ బందీల విడుదలపై, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ఖైదీల విడుదలపై మళ్లీ చర్చలు జరుగుతాయి. ఖైదీలు, బందీల బదిలీని యథాతథంగా ఇదేవిధంగా కొనసాగించాలా ? లేదా ? అనే దానిపై సోమవారం నుంచి జరిగే ఇజ్రాయెల్ – హమాస్ చర్చల్లో క్లారిటీ వస్తుందని ఖతర్ (Israel – Hamas Deal ) వెల్లడించింది.