Site icon HashtagU Telugu

Israel and Hamas : ఇజ్రాయిల్, హమాస్ మధ్య సంధి కుదిరేనా?

Is There A Truce Between Israel And Hamas..

Is There A Truce Between Israel And Hamas..

Israel and Hamas : అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ జరిపిన మెరుపు దాడి తర్వాత, గత 50 రోజులు పైగా గాజాలో నిరంతర మారణ హోమం సాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఘోషించినా, ఐక్యరాజ్యసమితి వారించినా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హెచ్చరించినా, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ససేమిరా తగ్గేదే లేదని మొండికేసి కూర్చున్నాడు. గాజాలో వేలాదిగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రాణాలు ఉగ్గబట్టి వలస పోతున్న ప్రజల సంఖ్య అశేషం. ఈ నేపథ్యంలో అటు నెతన్యాహు నుంచి ఇటు హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనీయే నుంచి ఒక శుభవార్త వినవచ్చింది. త్వరలోనే రెండు పక్షాల మధ్య సంధి కుదరబోతోందనేదే ఆ శుభవార్త. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులు, ఇజ్రాయిల్ (Israel) వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనా పౌరులు, ఇతర విదేశీయులు త్వరలో విడుదలకు నోచుకుంటారు.

We’re Now on WhatsApp. Click to Join.

ఈ విషయాన్ని నెతన్యాహు స్వయంగా తెలియజేశారు. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న యుద్ధానికి విరామం ప్రకటించి, బందీలను బంధ విముక్తులను చేయడం త్వరలో జరుగుతుందని నెతన్యాహు చేసిన ప్రకటన సంధి కుదరవచ్చన్న ఆశాభావాన్ని కలిగిస్తుంది. ఇదే విషయాన్ని హమాస్ నాయకుడు ఇస్మాయిల్ కూడా స్పష్టం చేశారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా ఇరు నాయకులూ తేల్చి చెప్పలేదు. మధ్యవర్తుల ద్వారా ఇరుపక్షాల మధ్య సంధి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు మాత్రం అర్థమవుతుంది. సంధి ఒప్పందం ప్రకారం ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం ఎంతకాలం అమల్లో ఉంటుందనే ప్రాతిపదిక మీదనే చర్చలు జరుగుతున్నట్టు నాయకులు చెప్తున్నారు.

పూర్తి స్థాయిలో సంధి ఒప్పందాలు జరిగాక విరుపక్షాల చేతుల్లో బంధీగా ఉన్న స్త్రీలు, పసిపిల్లలు అందరూ విడుదల చేయబడతారు. ఇంత భయానక విధ్వంసం జరిగాక, వేలాది మానప్రాణాలు బలైపోయాక, కోట్లాది ఆస్తి నష్టం జరిగాక ఇప్పుడు ఈ సంధి ఒప్పందం జరుగుతోంది. ఇప్పటికైనా ఇది రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణానికి గట్టి పునాదులు వేయాలని ప్రపంచమంతా కోరుకుంటుంది.

చైనా హెచ్చరిక:

ఈ సంధి ప్రయత్నాలైనా ప్రపంచం ఒత్తిడి మీదనే సాగుతున్నాయి. మంగళవారం జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ లిన్ పింగ్ ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధాన్ని తక్షణమే విరమించాలని తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు గాజాలో మానవీయ పునరావాస కార్యక్రమాలకి అంతరాయం కలగకుండా చూడాలని, గాజాలో ఉన్న ప్రజలు దౌర్జన్యంగా బలవంతంగా మరోచోటకు వలస పోయే అనివార్య పరిస్థితులను అరికట్టాలని చైనా అధ్యక్షుడు చెప్పారు. ఈ సమావేశంలో భారత ప్రధాని తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్, అమాయక పౌరుల హక్కులను ఖండించారు కానీ, గాజా ఇజ్రాయిల్ మధ్య యుద్ధ విరమణ విషయంలో చైనా ప్రదర్శించిన ఆత్రుతను ఆయన కనబరచలేదు.

మొత్తానికి ఏ దేశం మాట ఎలా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్ (Israel)కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు సాధారణ పౌరులతో సహా ప్రపంచమంతా గాజాపై దాడిని వెంటనే విరమించాలని ముక్తకంఠంతో వేడుకుంటుంది. ఈ విన్నపాలు నెతన్యాహు చెవిని పడుతున్నాయా.. దాని పరిణామమే ఇప్పుడు జరగబోతున్న సంధి ఒప్పందమా.. ఏది ఏమైనా ఎప్పటికైనా సంధి జరిగి దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొంటే అదే చాలని సకల దేశాల ప్రజలూ కోరుకుంటున్నారు.

Also Read:  India Vs Canada : కెనడియన్లకు వీసాలపై భారత్ కీలక నిర్ణయం