Iran IRGC: ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), అమెరికా యుద్ధనౌకతో పాటు బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ బేస్‌పై డ్రోన్, క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించింది. అరేబియా సముద్రంలో మోహరించిన అమెరికన్ నేవీకి చెందిన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఎయిర్‌క్రాఫ్ట్ USS అబ్రహం లింకన్‌ను భారీగా దెబ్బతీశామని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది.
యుద్ధం కొనసాగుతుందన్న ఇరు పక్షాలు
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు యుద్ధం కొనసాగిస్తామని అమెరికా-ఇజ్రాయెల్ ప్రకటించాయి. మరోవైపు అమెరికాకు, ట్రంప్‌కు గుణపాఠం చెప్పే వరకు దాడులు ఆపబోమని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. దీనిని బట్టి చూస్తే ఈ యుద్ధం ఇంకా కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ఐపీఎల్ తర్వాత భారత్ ఆడబోయే సిరీస్‌లు ఇవే!
ఒమన్ సమీపంలో దాడి
ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ‘ప్రెస్ టీవీ’ కథనం ప్రకారం.. ఒమన్ సమీపంలో ఉన్న అమెరికా యుద్ధనౌకపై IRGC ఖచ్చితమైన దాడి చేసింది. ఇరాన్ సరిహద్దు నుండి 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని భారీ నష్టం కలిగించామని ఇరాన్ తెలిపింది. దాడి తర్వాత ‘అబ్రహం లింకన్’ యుద్ధనౌక పనిచేయడం లేదని, అది వెనక్కి తగ్గి సురక్షిత ప్రాంతానికి వెళ్తోందని ఇరాన్ పేర్కొంది. బహ్రెయిన్‌లోని అమెరికాకు చెందిన మీనా సల్మాన్ నౌకాదళ స్థావరంపై కూడా డ్రోన్ దాడులు జరిగాయని, అక్కడ భారీ నష్టం జరిగిందని ఇరాన్ వెల్లడించింది.
ఇరాన్ నౌకను కూల్చేశామన్న అమెరికా
అమెరికా నౌకాదళం ఇరాన్ వాదనలను కొట్టిపారేస్తూ ఈ క్రింది వివరాలను వెల్లడించింది. ఇరాన్ చేసిన దాడిని విజయవంతంగా తిప్పికొట్టామని ప్రకటించింది. విమానవాహక నౌక వైపు వస్తున్న ఇరాన్ నౌకను మొదట ‘మార్క్-45’ గన్‌తో హెచ్చరించామని, ఆ తర్వాత హెల్‌ఫైర్ క్షిపణులతో కూడిన హెలికాప్టర్ ద్వారా దాడి చేసి ఆ ఇరాన్ నౌకను కూల్చివేసినట్లు పేర్కొంది. అమెరికా యుద్ధనౌకకు కనీసం చిన్న గీత కూడా పడలేదని, సిబ్బంది, నౌక అంతా సురక్షితంగా ఉన్నారని అమెరికా ప్రకటించింది.
