Iran Terror Attack: ఇరాన్‌లోని ఆగ్నేయ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఒక కోర్టు భవనంపై ఉగ్రవాదుల దాడి (Iran Terror Attack) జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు దాడి చేసినవారు కూడా ఉన్నారు. దాడి చేసినవారు తుపాకీతో కాల్పులు జరిపారు. గ్రనేడ్‌లను విసిరారు.
పరిస్థితి నియంత్రణలో ఉంది- ఐఆర్‌జిసి
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) ఒక అధికారిక ప్రకటనలో వారి గ్రౌండ్ ఫోర్సెస్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రణలోకి తీసుకున్నాయని, ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపింది. పరిస్థితి ఇప్పుడు పూర్తిగా నియంత్రణలో ఉందని, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని ఐఆర్‌జిసి హామీ ఇచ్చింది. ప్రాంతీయ పరిపాలన అధికారులు ప్రజలను న్యాయ శాఖ, దాని పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని కోరారు.
Also Read: Green Chutney Recipe: డయాబెటిస్ బాధితులకు వరం గ్రీన్ చట్నీ.. తయారు చేసుకోండిలా!
దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందా?
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ దాడికి బాధ్యతను జైష్ అల్-జుల్మ్ అనే ఉగ్రవాద సంస్థ స్వీకరించింది. ఈరాన్ ఇప్పటికే ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 2012లో స్థాపించబడిన ఈ సంస్థ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతంలోని సున్నీ ముస్లిం సమాజ హక్కుల కోసం పోరాడుతున్నట్లు పేర్కొంటుంది. అయితే, జైష్ అల్-జుల్మ్‌కు పాకిస్థాన్ మద్దతు ఉందని ఈరాన్ ఆరోపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలలో జైష్ అల్-జుల్మ్ ఇరాన్ భద్రతా దళాలు, సాధారణ పౌరులపై అనేక ఘోరమైన దాడులు చేసింది. సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంది.
దాడి వివరాలీవే
న్యూస్ ఏజెన్సీ ఎఎఫ్‌పీ నివేదిక ప్రకారం.. సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంత డిప్యూటీ పోలీస్ కమాండర్ అలీరెజా దలిరీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారు సాధారణ పౌరుల వేషంలో భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారు భవనంలోకి గ్రనేడ్ విసిరారని, దీని వల్ల ఒక సంవత్సరం వయస్సు గల శిశువు, ఆ శిశువు తల్లితో సహా అనేక మంది మరణించారని తెలిపాడు. గత సంవత్సరం అక్టోబర్‌లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 10 మంది పోలీసులు మరణించారు.