Site icon HashtagU Telugu

Iran-US Conflicts: అమెరికాకు ఇరాన్ వార్నింగ్‌..! ‘భూగర్భ క్షిపణి నగరం’ వీడియో విడుద‌ల‌

Iran

Iran

Iran-US Conflicts: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ త‌రువాత అమెరికా, ఇరాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో కొత్త అణు ఒప్పందంపై చ‌ర్చ‌ల‌ను తిరిగి ప్రారంభించ‌డానికి ట్రంప్ టెహ్రాన్ కు రెండు నెల‌ల ఆల్టిమేటం ఇచ్చార‌ని ఆక్సియోస్ నివేదించింది. అయితే, ఈ విష‌యంపై ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అణు ఒప్పందంపై ఇరాన్ తో చ‌ర్చ‌ల‌కు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపాడు. ఈ మేర‌కు ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీకి లేఖ రాసిన‌ట్లు పేర్కొన్నారు. అయితే, చ‌ర్చ‌ల‌కు వారు అంగీక‌రిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేసిన ట్రంప్‌.. అదే స‌మ‌యంలో ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ల‌ముందు రెండు మార్గాలున్నాయి. సైన్యం లేదా ఒప్పందం చేసుకోవ‌టం. ఒప్పందానికే నేను ప్రాధాన్యం ఇస్తా. ఎందుకంటే ఇరాన్ ను దెబ్బ‌తీయాల‌నుకోవ‌టం లేద‌ని ట్రంప్ ఘాటుగా హెచ్చ‌రించారు. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై ఇరాన్ మండిప‌డింది. అయితే, తాజాగా.. ఓ వీడియోను ఇరాన్‌ విడుద‌ల చేసింది.

Read Also: Bhadrachalam : కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!

ఇరాన్ త‌న ఆయుధ సామార్థ్యాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ వీడియోను విడుద‌ల చేసింది. దాదాపు 85 సెక‌న్ల నిడివిగ‌ల ఈ వీడియోలో అత్యాధునిక క్షిప‌ణుల‌ను ప్ర‌ద‌ర్శించింది. ఇరాన్ కు చెందిన సాయుధ బ‌ల‌గాల అధిప‌తి హోస్సెనీ బ‌ఘేరీ, ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కోర్ ఏరోస్పేస్ క‌మాండ‌ర్ అమీర్ అలీ హ‌జిజాద్ ఓ వాహ‌నంపై సొరంగ మార్గంలో ప్ర‌యాణిస్తూ ఆయుధాల‌ను వీక్షించిన దృశ్యాలున్నాయి. ఈ వీడియోలో ఖైబ‌ర్ షేకాన్స్‌, ఘ‌ద్ర‌హాస్‌, సెజ్జిల్స్‌, హ‌జ్ ఖాసీమ్స్‌, ప‌వేహ్ ల్యాండ్ అటాక్ క్షిప‌ణులు ఉన్నాయి. ఈ వీడియో ద్వారా అమెరికాకు ఇరాన్ హెచ్చ‌రిక‌లు చేసిన‌ట్ల‌యింది.

Read Also: Bhatti Vikramarka : ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి’’.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు భట్టి హితవు

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ హెచ్చ‌రిక‌ల త‌రువాత ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయాతుల్లా అలీ ఖ‌మేనీ స్పందించారు. ఎవ‌రైనా త‌మ జోలికి వ‌స్తే ఊరుకోమ‌ని, సంబంధంలేని విష‌యాల్లో టెహ్రాన్ పై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తే అమెరికాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గులుతుంద‌ని హెచ్చ‌రించారు. అయితే, ఈ వీడియో త‌రువాత భూగ‌ర్భ క్షిప‌ణి న‌గ‌రం గురించి ఐఆర్‌జీసీ-ఏఎఫ్ క‌మాండ‌ర్ హ‌జీజాదే మాట్లాడుతూ.. “మనం ఈరోజు ప్రారంభిస్తే, ప్రతివారం ఒక కొత్త క్షిపణి నగరాన్ని ఆవిష్కరించగలం. ఈ ప్రాజెక్ట్ రాబోయే రెండేళ్ల పాటు కొనసాగుతుంది” అని అన్నారు. ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తోందని కమాండర్ ప్రకటన నుండి స్పష్టమవుతోంది. అయితే, ఇరాన్ విడుద‌ల చేసిన వీడియోపై అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.