Site icon HashtagU Telugu

Earthquake : ఉత్తర ఇరాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

Earthqueak

Earthqueak

Earthquake : ఇరాన్‌లో జూన్ 20న సంభవించిన భూకంపం పలు అనుమానాలకు దారితీసింది. ఈ భూప్రకంపనల వెనుక ఆ దేశం రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించి ఉండవచ్చన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, భూకంప నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ వాదనలను కొట్టిపారేశారు. భూకంపం స్వభావాన్ని పరిశీలించిన అనంతరం ఇది సహజ ప్రక్రియ ద్వారా ఏర్పడిన భూకంపమేనని స్పష్టం చేశారు. ఈ శక్తివంతమైన భూకంపం ఉత్తర ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై, సెమ్నాన్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు నమోదయ్యాయని తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

GHMC : జీహెచ్ఎంసీలో 27 మంది అధికారుల బదిలీలు

ఈ ప్రాంతానికి సమీపంలో సెమ్నాన్ అంతరిక్ష కేంద్రం, సైనిక క్షిపణి కేంద్రాలు ఉండటంతో, ఇది కృత్రిమంగా ఏర్పడిన భూకంపమై ఉంటుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య భూకంపం సంభవించడంతో, ఈ అనుమానాలు మరింత ముదిరాయి. ముఖ్యంగా ఇరాన్ తన అణు ప్రోగ్రాం గురించి చర్చలకు తావు లేదని ఇటీవల చేసిన ప్రకటనలతో, ఈ భూకంపానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహానీ జరగలేదని, స్వల్ప నష్టమే సంభవించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. ఇరాన్ టెక్టోనిక్‌ ఫలకాల మధ్య విస్తరించిన ఆల్పైన్-హిమాలయన్ భూకంప మండలంలో ఉన్న దేశంగా, ఇక్కడ భూకంపాలు సాధారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంవత్సరానికి సగటున 2,100 భూకంపాలు నమోదవుతాయని, అందులో దాదాపు 15–16 భూకంపాలు 5.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. 2006–2015 మధ్య కాలంలో 96,000 భూకంపాలు నమోదైనట్లు అధికారిక నివేదికలు పేర్కొంటున్నాయి.

ఒక్కోసారి అణు పరీక్షల వల్ల ఏర్పడే శబ్దం , ప్రకంపనలు భూకంపాల్లా కనిపించొచ్చు. అయితే, భూకంప శాస్త్రవేత్తలు భూకంప తరంగాల విశ్లేషణ ద్వారా సహజమైనదా కృత్రిమమైనదా అనే అంశాన్ని ఖచ్చితంగా నిర్ణయించగలుగుతారు. తాజా భూకంపంపై వచ్చిన సీస్మిక్ డేటా ప్రకారం, ఇది సహజ కారణాలతో ఏర్పడిన భూకంపమేనని తేలిందని అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS), సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పంద సంస్థ (CTBTO) నిపుణులు, ఇతర స్వతంత్ర శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Rahul Gandhi : ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం: రాహుల్ గాంధీ