Pahalgam Attack : పాకిస్తాన్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దర్యాప్తులో రష్యా, చైనా, పశ్చిమ దేశాలు భాగం కావాలని కోరారు. ‘‘రష్యా, చైనా, పశ్చిమ దేశాలు కలిసి ప్రత్యేక దర్యాప్తు టీమ్‌ను ఏర్పాటుచేస్తే బాగుంటుంది. పహల్గాం ఉగ్రదాడిపై ఆ టీమ్ దర్యాప్తు చేయాలి.మోడీ (భారత్) నిజం చెబుతున్నారా.. నేను నిజం చెబుతున్నానా అనేది నిగ్గుతేల్చాలి’’ అని ఖ్వాజా ఆసిఫ్ కోరారు. రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఆర్ఐఏ నోవోస్తీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఖ్వాజా ఆసిఫ్ ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Terrorists Trekking : 22 గంటలు ట్రెక్కింగ్ చేసి వచ్చి మరీ ఎటాక్
కుట్రదారులు ఎవరో గుర్తిద్దాం..
‘‘పహల్గాం(Pahalgam Attack) ఉగ్రదాడికి బాధ్యులు ఎవరో గుర్తిద్దాం.. కుట్రదారులు ఎవరో గుర్తిద్దాం.. ఒట్టి మాటలతో, పనికి రాని వ్యాఖ్యలతో ఫలితం ఉండదు. ఆ దాడిలో పాకిస్తాన్ ప్రత్యక్ష పాత్రను నిరూపించే ఆధారం బయటికి రావాలి. పాకిస్తాన్ మద్దతు కలిగిన వారి పాత్ర ఉంటే ఆ వివరాలు కూడా బయటకురావాలి. ప్రస్తుతం జరుగుతున్నది వ్యాఖ్యానాల పర్వం. దానితో ఒరిగేదేం లేదు’’ అని ఖ్వాజా ఆసిఫ్ కామెంట్ చేశారు. కాగా, పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ కశ్మీర్ విభాగం ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఈవిషయం తెలిసినా ఖ్వాజా ఆసిఫ్ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.
స్వాతంత్య్ర సమరయోధులై ఉండొచ్చు : ఇషాక్ దర్
‘‘పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారు బహుశా స్వాతంత్య్ర సమరయోధులై ఉండొచ్చు’’ అని పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌కు చెడ్డపేరు తెచ్చే కుట్ర : ఖ్వాజా ఆసిఫ్
‘‘పాకిస్తాన్‌కు చెడ్డపేరు తేవాలనే దురుద్దేశంతో ఎవరైనా ఇతరులు పహల్గాం ఉగ్రదాడిని చేయించి ఉండొచ్చు’’ అని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.