Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇప్పటికే సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న వేళ, అమెరికా అధికారులు మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితులను సంక్లిష్టతరం చేస్తున్నారు. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో విమర్శలు ఇంకా చల్లారకముందే.. ఇప్పుడు వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కూడా భారత్‌పై పరుష వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. భారత్ రెండు నెలల్లో తప్పనిసరిగా అమెరికాకు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని, చర్చలకు దిగక తప్పదని వ్యాఖ్యానించారు. “ఇప్పుడే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. చివరికి భారత్ యూఎస్ మార్కెట్‌నే ఆశ్రయించాల్సి వస్తుంది. కస్టమర్ ఎల్లప్పుడూ సరిగా ఉంటాడు. అందుకే అమెరికాతో మళ్లీ ఒప్పందాలకు సన్నద్ధం కావాల్సిందే” అని లుట్నిక్ అన్నారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధం తర్వాత భారత్ రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోందని లుట్నిక్ ఆరోపించారు. “యుద్ధానికి ముందు భారత్ కేవలం 2 శాతం మాత్రమే రష్యా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడు అది 40 శాతానికి చేరింది. దీంతో రష్యాకు కోట్ల రూపాయలు వస్తున్నాయి. అందుకే రష్యా శాంతి చర్చలకు ముందుకు రావడం లేదు. భారత్ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది
చైనా, యూరోపియన్ దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండగా, భారత్‌పైనే అమెరికా కఠినంగా టారిఫ్‌లు విధించడంపై ప్రశ్నించగా, లుట్నిక్ స్పష్టతనిచ్చారు. “చైనీయులు, భారతీయులు మనకు అమ్ముతారు. కానీ వారు ఒకరికొకరు మాత్రం అమ్ముకోరు. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్ వారికి తప్పనిసరి అవుతుంది. అందుకే భారత్ మళ్లీ మాకు దగ్గర కావాల్సిందే” అని లుట్నిక్ అన్నారు.
లుట్నిక్ తన హెచ్చరికలో భాగంగా.. భారత్ అమెరికాతో చర్చలకు దిగకపోతే, 50 శాతం సుంకం భరించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత కఠిన స్థితికి నెడుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే, రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగుతాయన్న స్పష్టమైన సంకేతాలు భారత్ ఇచ్చింది. “మన దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాం” అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అమెరికా ఒత్తిడి ఉన్నా.. జాతీయ ప్రయోజనాలు ప్రాధాన్యమేనని భారత్ సంకేతమిచ్చింది. సుంకాల వివాదం వాణిజ్య సంబంధాలను గందరగోళంలోకి నెడుతుండగా, వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ ఉద్రిక్తతలు ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండగా, భారత్ చమురు దిగుమతులపై అమెరికా చూపిస్తున్న కఠిన వైఖరి, భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలకు సవాలు కానుంది.
Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జరిగిందా?