Site icon HashtagU Telugu

Afghanistan Diplomats: తొలిసారిగా ఆఫ్ఘన్ దౌత్యవేత్తలకు ఇండియా ట్రైనింగ్

India Training Afghanistan Diplomats For The First Time

India Training Afghan Diplomats For The First Time

ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) లోని తాలిబన్ ప్రభుత్వంతో స్నేహ సంబంధాల బలోపేతంపై భారత్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖలో రాయబారులు, దౌత్యవేత్తలుగా (Diplomats) చేరిన అధికారులకు ట్రైనింగ్ ఇస్తోంది.కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం వేదికగా మార్చి 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సంబంధాలను పెంపొందించే దిశగా ఈ చర్య తొలి అడుగుగా నిలిచింది. 2022 జులైలో భారతదేశం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) లో రెండు డజన్ల మంది ఆఫ్ఘన్ మిలిటరీ క్యాడెట్‌లకు కూడా శిక్షణ ఇచ్చింది. ఇవన్నీ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బలోపేతం అవుతున్న సంబంధాలకు నిదర్శనం.

భారతదేశం మరియు ఇతర ఆసియా దేశాలు గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌కు (Afghanistan) 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను అందించాయి.  ఈ సాయాన్ని పాకిస్థాన్ గుండా వెళ్లే మార్గంలో కాకుండా ఇరాన్‌లోని చబహార్ పోర్ట్ ద్వారా పంపనున్నారు. తీవ్రమైన ఆహార సంక్షోభంతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్థాన్‌కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమల సహాయం ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరంగా ఉండరాదని..

భారత్‌తో పాటు ఐదు మధ్య ఆసియా దేశాలు ఆఫ్ఘనిస్థాన్‌ అనేది ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరంగా ఉండరాదని స్పష్టం చేశాయి. ఈ ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు రూ. 200 కోట్ల ($ 24.3 మిలియన్లు) అభివృద్ధి సహాయాన్ని ప్రకటించారు.  భారత ప్రకటనను తాలిబాన్ సర్కారు స్వాగతించింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు, విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహద పడుతుందని పేర్కొంది. అయితే, భారతదేశం ఇంకా తాలిబాన్ పాలనను గుర్తించలేదు. కాబూల్‌లో నిజంగా అందరినీ కలుపుకొని పోయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారత్ కోరుతోంది.

ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan) స్టూడెంట్ గుజరాత్ వర్సిటీ టాపర్

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 27 ఏళ్ల రజియా మురాది గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ పీజీ కోర్సులో చేరింది.ఆమె భారత ప్రభుత్వ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అందించిన స్కాలర్‌షిప్‌ను పొందింది. ఈ కోర్సులో టాపర్ గా నిలిచినందుకు ఆమె ఇటీవల బంగారు పతకాన్ని అందుకోవడంతో వార్తల్లో నిలిచింది.

Also Read:  Final Test: అహ్మదాబాద్ టెస్ట్ డ్రా.. సిరీస్ భారత్ కైవసం