Site icon HashtagU Telugu

Imran Khan : పాక్ రాజకీయంలో అనూహ్య మలుపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Pakistan Election

Imran Khan : పాకిస్తాన్ రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రస్తుతం జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తాజాగా ఆయనకు అనుకూలంగా  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పార్లమెంటులోని రిజర్వుడు సీట్లకు ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) అర్హమైందే అని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కాజీ ఫైజ్‌ ఈసా నేతృత్వంలోని 13మంది సభ్యుల ధర్మాసనం తీర్పును ఇచ్చింది. పార్లమెంటు, ప్రొవిన్షియల్‌ అసెంబ్లీలలో ఇమ్రాన్‌ ఖాన్ రాజకీయ పార్టీకి రిజర్వుడు సీట్లను కేటాయించొద్దని పాకిస్తాన్ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అది  సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పింది.  ఎన్నికల సంఘం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సున్నీ ఇత్తిహాద్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐసీ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈమేరకు తీర్పును ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఏడాది ఫిబ్రవరి 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ)  పార్టీ గుర్తు బ్యాట్‌పై పాక్ ఎన్నికల సంఘం(Pakistan) బ్యాన్ విధించింది. దీంతో అది ఎన్నికల్లో పోటీచేసే అర్హతను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్(Imran Khan) మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి భారీ సంఖ్యలో గెలిచారు. అనంతరం వారంతా ఎస్‌ఐసీ పార్టీలో చేరారు. పార్లమెంటు, ప్రొవిన్షియల్‌ అసెంబ్లీల్లో దామాషా పద్దతిలో పార్టీలకు నిర్దిష్ట రిజర్వుడ్ స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఎస్‌ఐసీ పార్టీకి కేటాయించలేదు. అంతటితో ఊరుకోకుండా.. రిజర్వుడ్ సీట్లు పొందేందుకు ఎస్ఐసీ పార్టీకి అర్హత లేదని పాక్ ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ పాక్ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎస్ఐసీకి కూడా రిజర్వుడు సీట్లను కేటాయించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో త్వరలోనే చాలామంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రిజర్వుడ్ సీట్ల ద్వారా పార్లమెంటు, ప్రొవిన్షియల్ అసెంబ్లీలలోకి అడుగుపెట్టనున్నారు. ఈ పరిణామం ప్రస్తుతం పాక్‌ను పాలిస్తున్న షెహబాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Also Read :PM Modi : తొలిసారిగా మోడీకి ‘సంకీర్ణ’ పరీక్ష.. వాట్స్ నెక్ట్స్ ?