President Arrested : దక్షిణ కొరియా పదవీచ్యుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేశారు. తొలుత వందల మంది దర్యాప్తు అధికారులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయన వద్దనున్న అధ్యక్ష భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. కొంతసేపు దర్యాప్తు అధికారులు, అధ్యక్ష భద్రతా దళాల మధ్య వాగ్వాదం నడిచింది. తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ అక్కడి నుంచి ఆయనను తరలించారు. గతంలో ఒకసారి యూన్ సుక్ యోల్‌ను అరెస్టు చేసేందుకు యత్నించగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామునే అరెస్టు ప్రక్రియను పూర్తి చేశారు. 2024 డిసెంబరులో అకస్మాత్తుగా దేశంలో అత్యవసర పరిస్థితిని ఎందుకు విధించారు ? కారణం ఏమిటి? ఎవరు అందించిన సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ? పార్లమెంటును సంప్రదించకుండా ఏకపక్షంగా ఎందుకు ఎమర్జెన్సీ విధించారు ? వంటి అంశాలపై యూన్ సుక్ యోల్‌ను దర్యాప్తు విభాగం అధికారులు(President Arrested) ప్రశ్నించనున్నారు.
Also Read :Population Control Vs Chandrababu : ఎక్కువ మంది పిల్లల్ని కనడం తప్పేం కాదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎందుకు అరెస్టు చేశారు ?
దక్షిణ కొరియా పదవీచ్యుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న ఒకేఒక్క తొందరపాటు నిర్ణయం వల్ల పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆయన దేశ అధ్యక్షుడి హోదాలో 2024 సంవత్సరం డిసెంబరులో దక్షిణ కొరియాలో ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. అయితే ఆయన నిర్ణయాన్ని అధికార పార్టీ, విపక్ష పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. దేశంలో మార్షల్ లా అమలు చట్టవిరుద్ధమని పార్లమెంటు స్పీకర్ ప్రకటించారు.
Also Read :Indian Army Day: నేడు ఇండియన్ ఆర్మీ డే.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
దీంతో వెంటనే నాలుక కరుచుకున్న యూన్ సుక్ యోల్.. ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు.అయినా అధికార, విపక్ష పార్టీలన్నీ కలిసి ఆయనను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానానికి పార్లమెంటులో ఆమోదం తెలిపాయి. దీంతో ఆయన దేశాధ్యక్ష పదవిని కోల్పోయారు. యూన్ సుక్ యోల్‌పై పార్లమెంటు ఆమోదించిన అభిశంసన తీర్మానంపై దక్షిణ కొరియా రాజ్యాంగ న్యాయస్థానం తదుపరిగా విచారించి, తొలగింపు సరైందా ? కాదా ? అనేది తేల్చనుంది. పార్లమెంటులో అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించిన వెంటనే యూన్ సుక్ యోల్‌పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆయనను అరెస్టు చేశారు.