Julian Assange : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను స్వచ్ఛమైన జర్నలిజం చేశాను. దాన్ని కూడా తప్పుగా ఒప్పుకునేలా చేశారు. ఇంతకంటే బాధ కలిగించే విషయం ఇంకేం ఉంటుంది ?’’ అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో యూరప్ దేశాల హక్కుల మండలి సమావేశంలో మాట్లాడుతూ అసాంజే ఎమోషనల్ అయ్యారు. ‘‘జర్నలిజం చేయడం ఒక నేరం కాదు. ఇది స్వేచ్ఛాయుత సమాజానికి ఒక మూలస్తంభం. సమాచారయుత సమాజం కావాలంటే జర్నలిజం తప్పక అవసరం’’ అని ఆయన తెలిపారు. ఈసందర్భంగా భార్య స్టెల్లా కూడా జూలియన్ అసాంజే (Julian Assange) పక్కనే ఉన్నారు. ‘‘జర్నలిజం చేశానని చెప్పినందుకు నన్ను సంవత్సరాల తరబడి జైలులో పెట్టారు. జర్నలిజం చేసి తప్పు చేశానని చెప్పినందుకు నన్ను స్వేచ్ఛగా వదిలేశారు. అయితే ఇలాంటి వ్యవస్థలో ఉన్నందుకు నేను స్వేచ్ఛగా ఫీల్ కాలేకపోతున్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read :Mount Everest Growth : ‘ఎవరెస్టు’ ఎత్తు ఎందుకు పెరుగుతోంది.. ఆసక్తికర నివేదిక
‘‘చేయని తప్పుకు శిక్ష అనుభవించడం కంటే.. చేయని తప్పును ఒప్పుకొని స్వేచ్ఛగా ఉండటానికే నేను ప్రయారిటీ ఇచ్చాను. వాస్తవానికి న్యాయం జరిగిందని భావించడం లేదు’’ అని అసాంజే కామెంట్ చేశారు. తనను జైలు నుంచి విడుదల చేయించేందుకు భార్య స్టెల్లా ఎంతో పోరాటం చేసిందన్నారు. ‘‘నేను అందరినీ కోరేది ఒక్కటే.. జర్నలిస్టుల పనిని అడ్డుకోకూడదు. వారిని స్వేచ్ఛగా పని చేయనివ్వాలి. పాత్రికేయులను విచారించకూడదు’’ అని అసాంజే తెలిపారు. గూఢచర్యం చట్టం కింద అసాంజేకు గతంలో అమెరికా కోర్టు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అమెరికా అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం అసాంజే అప్లై చేసుకున్నారు. ఈక్రమంలోనే ఐరోపా దేశాలకు చెందిన కీలకమైన హక్కుల సంస్థల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో వికీలీక్స్ ఫౌండర్ ఉన్నారు. ప్రభుత్వానికి చెందిన వందల, వేల రహస్య పత్రాలను ప్రచురించి, వాటిని బహిర్గతపర్చినందుకు అసాంజేపై అమెరికా ప్రభుత్వం గతంలో కేసులు నమోదు చేసింది.