అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఘోరమైన పేలుడు సంభవించింది. స్థానిక సమయానుసారం శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సైనిక సామగ్రి తయారీ కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన ఓ పరిశ్రమలో జరిగిన ఈ విపరీతమైన పేలుడు ధాటికి పరిసర ప్రాంతమంతా కుదేలైంది. అక్కడ పార్క్ చేసిన కార్లు గాల్లోకి ఎగిరిపడి చెల్లాచెదురుగా పడ్డాయి. కర్మాగారంలో ఆ సమయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. దాదాపు 19 మంది ఉద్యోగులు ఇంకా కనబడటం లేదని అధికారులు వెల్లడించారు.
Damage Kidney: వామ్మో.. మనం తరచుగా తీసుకునే ఈ ఫుడ్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయా.. చాలా డేంజర్!
పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక దళాలు, రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. భారీగా పొగలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. రాత్రంతా రక్షణ చర్యలు కొనసాగాయి. ఈ కర్మాగారం మిలిటరీ వాహనాలు, బాంబు షెల్స్, డిఫెన్స్ మెటీరియల్ తయారీకి ప్రసిద్ధి చెందిందని, అందువల్ల పేలుడు తీవ్రత మరింతగా పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇక ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రాథమికంగా ఇది సాంకేతిక లోపమా, లేక రసాయన పదార్థాల అనూహ్య ప్రతిచర్యవల్ల జరిగిందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు (FBI) కూడా రంగంలోకి దిగాయి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, ఆధారాలు సేకరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదం అమెరికా పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
