Hezbollah Vs Israel : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఓ వైపు దక్షిణ లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెలీ ఆర్మీ చొరబడి హిజ్బుల్లా మిలిటెంట్లను ఏరిపారేస్తోంది. మరోవైపు ఇజ్రాయెలీ వాయుసేన లెబనాన్ రాజధాని బీరుట్ సహా అన్ని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. హిజ్బుల్లా మిలిటెంట్ల ఆయుధ గోదాములను ధ్వంసం చేస్తోంది. హిజ్బుల్లాను నడిపిస్తున్న ముఖ్య కమాండర్లు, నేతలను ఇజ్రాయెల్ నిర్దాక్షిణ్యంగా మట్టుబెడుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం హిజ్బుల్లా సెకండ్ ఇన్ కమాండ్‌గా వ్యవహరిస్తున్న నయీం ఖాసిం లెబనాన్ నుంచి మిస్సయ్యారు. ఆయన ఎలాగోలా లెబనాన్ నుంచి ఇరాన్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనను కడతేర్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుందనే భయంతోనే నయీం ఖాసిం(Hezbollah Vs Israel) ఇరాన్‌కు వెళ్లిపోయారని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఇటీవలే లెబనాన్, సిరియాలలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ పర్యటించారు. ఆయన విమానంలోనే ఈనెల 5న నయీం ఖాసిం ఇరాన్‌కు వెళ్లారని అంటున్నారు.
Also Read :Pro Khalistan Group: ఢిల్లీ పేలుడు వెనుక ఖలిస్తానీలు.. టెలిగ్రాంకు పోలీసుల లేఖ
సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇస్తూ నయీం ఖాసిం మూడు ప్రసంగాలు చేశారు. వాటిలో రెండు ప్రసంగాలు ఇరాన్ రాజధాని తెహ్రాన్ నుంచి చేసినవి కాగా.. మరొక ప్రసంగం లెబనాన్ రాజధాని బీరుట్ నుంచి చేసినది. అంటే లెబనాన్‌లో ఉండగా నయీం ఖాసిం చేసిన ప్రసంగాలు, విడుదల చేసిన సందేశాలు చాలా తక్కువ. ఒకవేళ ఏవైనా వీడియో మెసేజ్‌లను విడుదల చేస్తే.. లొకేషన్‌ను ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తుందనే భయంతో ఆయన కెమెరాలకు దూరంగా ఉండిపోయారని సమాచారం. లెబనాన్‌లో షియా అమల్ ఉద్యమంలో నయీం ఖాసిం కీలక పాత్ర పోషించారు. 1982 సంవత్సరంలోనూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతుతో హిజ్బుల్లాను ఏర్పాటు చేయడంలో నయీం ఖాసిం ముఖ్య పాత్ర పోషించారు. 1992లో లెబనాన్‌లో జరిగిన ఎన్నికల్లో హిజ్బుల్లా రాజకీయ పార్టీ పోటీ చేసినప్పుడు.. దాని పార్లమెంటరీ ఎన్నికల ప్రచారానికి జనరల్ కోఆర్డినేటర్‌గా నయీం వ్యవహరించారు.