Hasinas Ouster Planned : బంగ్లాదేశ్ అధికార పీఠం నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను గద్దె దింపింది ఎవరు ? ఆమె బంగ్లాదేశ్ వదిలి పరారయ్యేలా చేసింది ఎవరు ? అనే అంశంపై బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథి, నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘షేక్ హసీనాను బంగ్లాదేశ్‌లో అధికార పీఠం నుంచి దింపేయడం అనేది ప్లాన్ ప్రకారం జరిగింది. దాని వెనుక పెద్ద కుట్ర ఉంది’’ అని మహ్మద్ యూనుస్ పేర్కొన్నారు. ‘‘హసీనాను ప్రధానమంత్రి పదవి నుంచి దింపేసే కుట్ర వెనక ఎవరున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. మహఫుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చని కొందరు అంటున్నారు. హసీనా దేశం వదిలి వెళ్లిపోయేలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం వెనుక కొందరు ఉన్నారనేది మాత్రం నిజం. ఆ ప్రతికూల పరిస్థితులన్నీ వాటంతట అవిగా ఏర్పడ్డవైతే కాదు. ఒక ప్రణాళిక ప్రకారమే షేక్ హసీనా చుట్టూ ప్రతికూల పరిస్థితులను క్రియేట్ చేశారు’’ అని యూనుస్(Hasinas Ouster Planned) తెలిపారు. క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా పాల్గొన్నారు.
Also Read :Domestic Violence Act : అన్ని మతాల మహిళలకూ గృహహింస చట్టం వర్తిస్తుంది : సుప్రీంకోర్టు
షేక్ హసీనాను బంగ్లాదేశ్‌లో గద్దె దించే కుట్రలో విదేశీ హస్తం ఉందనే వార్తలు కూడా వచ్చాయి.బంగ్లాదేశ్‌కు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో వైమానిక స్థావరం ఏర్పాటుకు అమెరికాకు హసీనా అనుమతి ఇవ్వలేదు. ఆ అక్కసుతో హసీనాపై తిరుగుబాటును అమెరికాయే చేయించిందని అంటున్నారు.అయితే దీనిపై తగిన ఆధారాలు లేవు. ఏదిఏమైనప్పటికీ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. ఆ నిరసనలు తీవ్రరూపం దాల్చి చివరకు హసీనా దేశం విడిచి భారత్‌కు పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం హసీనా ఢిల్లీలో ఆశ్రయం పొందారు.