Kamala Harris : అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలో ఏకంగా దేశ వైస్ ప్రెసిడెంట్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచార ఆఫీసుపై కాల్పులు జరిగాయి. దీన్ని అమెరికా భద్రతా సంస్థల పెద్ద వైఫల్యంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. ఆ ఘటనలను మరువకముందే ఇప్పుడు కమలా హ్యారిస్ (Kamala Harris) ఆఫీసు లక్ష్యంగా కాల్పులు జరగడం అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో లా అండ్ ఆర్డర్ ఏమైందని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తాజా ఘటన ఏమిటంటే..
తాజా ఘటన వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్ధరాత్రి తర్వాత అరిజోనా రాష్ట్రంలోని కమలా హ్యారిస్‌కు ఎన్నికల ప్రచార సమన్వయ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆఫీసు కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆ టైంలో ఆఫీసులో ఎవరూ లేకపోవవడంతో ముప్పు తప్పింది. డెమొక్రటిక్ పార్టీ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే అర్ధరాత్రి తర్వాత ఎవరూ లేనప్పుడు దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై డెమొక్రటిక్ పార్టీ నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇటీవలే ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరిగిన తరుణంలో అపర కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కేవలం ట్రంప్‌పైనే ఎందుకు హత్యాయత్నాలు జరుగుతున్నాయి. కమలా హ్యారిస్, బైడెన్‌లపై ఎవరూ హత్యాయత్నాలు ఎందుకు చేయడం లేదు?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read :Jammu Kashmir Assembly Elections: నేడు జమ్మూకశ్మీర్‌లో రెండో దశ పోలింగ్..!
- ఇటీవలే ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా.. ఓ వ్యక్తి గోడ దూకి లోపలికి చొరబడేందుకు యత్నించాడు. భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ట్రంప్‌పై కాల్పులు జరిపేందుకే వచ్చానని ఒప్పుకున్నాడు.
- రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకువెళ్లింది.