Hassan Nasrallah : లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన అంతిమయాత్రను శుక్రవారం బీరుట్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్ నుంచి ముప్పు ఉన్నందున ఈ యాత్రకు భారీ భద్రత కల్పించారు. అయితే హసన్ నస్రల్లా అంత్యక్రియల కార్యక్రమంపైనా ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడి చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వేచిచూడాల్సిందే. ఏదిఏమైనప్పటికీ ఇలాంటి వార్తలు హసన్ నస్రల్లా అంతిమ యాత్రలో పాల్గొనే వారికి భయం గొలిపేలా ఉన్నాయి. బీరుట్‌లోని ఓ ప్రదేశంలో హసన్ నస్రల్లా భౌతిక కాయాన్ని ఖననం చేసి సమాధిని నిర్మించనున్నారు. తదుపరి హిజ్బుల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హాషిం సఫియుద్దీన్(Hassan Nasrallah) నియమితులయ్యే అవకాశం ఉంది. నస్రల్లా, హాషిం సఫియుద్దీన్ దాదాపు ఒకేసారి హిజ్బుల్లాలో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
Also Read :Teenagers Attack : చికిత్స కోసం వచ్చి.. డాక్టర్‌ను హత్య చేసి పరారైన ఇద్దరు టీనేజర్లు
100 మంది పిల్లలకు హసన్ నస్రల్లా పేరు
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాకు లెబనాన్, ఇరాక్, ఇరాన్, సిరియా దేశాలలోని షియా వర్గంలో మంచి పేరుంది. అందుకే ఇరాక్‌లో జన్మించిన 100 మంది శిశువులకు హసన్ నస్రల్లా పేరు పెట్టుకున్నారు. ఆయన అంతిమ యాత్రకు ఒకరోజు ముందే ఈ వార్త వెలుగులోకి రావడం గమనార్హం. హసన్ నస్రల్లా నీతివంతుడు.. ఆయన అమరవీరుడు అంటూ ఇరాక్ ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుదానీ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇజ్రాయెల్ దాడి.. హసన్ నస్రల్లా అల్లుడి మృతి
ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే హసన్ నస్రల్లా కుమార్తె చనిపోగా.. తాజాగా సిరియాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఆయన అల్లుడు కూడా చనిపోయాడు. సిరియాలోని డమస్కస్ నగరంలో ఉన్న మజ్జే జిల్లాలోని పలు భవనాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులు జారవిడిచాయి. ఈ దాడిలో హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్- ఖాసిర్ చనిపోయారు. హిజ్బుల్లా మీడియా సంస్థ కూడా ఈవివరాలను ధ్రువీకరించింది.