Mpox Cases : మంకీపాక్స్ వైరస్ కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. పలు ప్రపంచ దేశాల్లో దీనికి సంబంధించిన కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. మంకీపాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్లను ‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. ఏయే దేశాల్లో మంకీపాక్స్ కేసులు (Mpox Cases) ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
కొత్తగా ప్రపంచ దేశాల్లో గుర్తించిన మంకీపాక్స్ వైరస్ వేరియంట్ పేరు ‘క్లాడ్ ఎల్‌బీ’(clade Ib). ఇంతకుముందు వ్యాపించిన మంకీపాక్స్ వైరస్ వేరియంట్ క్లాడ్ 1 నుంచే ఇది పుట్టింది. మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాపిస్తోందని తాజాగా స్వీడన్ ప్రభుత్వం ప్రకటించింది. చిన్న పిల్లలకు ఇది సోకే రిస్క్ ఎక్కువ అని తెలిపింది. ‘క్లాడ్ ఎల్‌బీ’ మంకీ పాక్స్ కేసులు బయటపడిన దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
Also Read :BRS : బీఆర్ఎస్ బలోపేతం కోసం ‘రీజియనల్’ మంత్ర!
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో రెండు రకాల మంకీపాక్స్ వైరస్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. ఈ దేశంలో క్లాడ్ I, క్లాడ్ ఎల్‌బీ రకాల మంకీపాక్స్ వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. లైంగిక సంపర్కం ద్వారా ఈ వేరియంట్లు ప్రబలుతున్నాయి. దీనివల్ల 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఈ దేశంలో 27వేల మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 1100 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు.
స్వీడన్
స్వీడన్ దేశంలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ ‘క్లాడ్ ఎల్‌బీ’ వ్యాపిస్తోందని ఆగస్టు 15వ తేదీనే గుర్తించారు. ఆఫ్రికా ఖండం అవతల దీనికి సంబంధించిన కేసులు బయటపడటం ఇదే తొలిసారి. స్వీడన్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్లు ఆఫ్రికాలో ఉండి.. తిరిగి వచ్చాక అతడిలో మంకీ పాక్స్ కేసును గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
బురుండి
బురుండి దేశంలో ఆగస్టు 9 నాటికి దాదాపు 61 మంకీపాక్స్ కేసులను నిర్ధారించారు. ఇవన్నీ క్లాడ్ ఎల్‌బీ రకానికి చెందిన మంకీపాక్స్ వేరియంట్ వల్ల వ్యాపించాయని గుర్తించారు. అయితే ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఎలాంటి మరణాలు కూడా సంభవించలేదు.
కెన్యా
కెన్యా దేశంలోనూ మంకీపాక్స్ వ్యాపిస్తోంది. ఈ దేశంలో క్లాడ్ ఎల్‌బీ రకం మంకీపాక్స్ ఇన్ఫెక్షన్‌ను తొలిసారిగా జూలై 29న గుర్తించారు. అయినప్పటికీ దీనివల్ల కెన్యాలో మంకీపాక్స్ మరణాలు సంభవించలేదు.
రువాండా
రువాండా దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవన్నీ క్లాడ్ ఎల్‌బీ రకం మంకీపాక్స్ వైరస్ వేరియంట్‌కు చెందినవి.
ఉగాండా
ఉగాండా దేశంలో క్లాడ్ ఎల్‌బీ రకం మంకీపాక్స్ వేరియంట్‌కు సంబంధించిన 2 కేసులను ఇప్పటివరకు గుర్తించారు. ఆగస్టు 2వ తేదీ వరకు వీటిని నిర్ధారించారు.