సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ట్రంప్ తన దేశ ఆర్థిక బలాన్ని ప్రదర్శించారు. ఇరాన్ చర్యల కారణంగా చమురు, ఇంధన నౌకలు ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలస్కా వంటి ఓడరేవుల వైపు మళ్లుతున్నాయని ఆయన చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Donald Trump

Donald Trump

Ceasefire: అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మరోవైపు యుద్ధ భయం కూడా పెరుగుతోంది. ఇరాన్ ఒక నిష్పక్షపాతమైన, సరైన ఒప్పందానికి అంగీకరించకపోతే, ఆ దేశంలోని ప్రతి పవర్ ప్లాంట్‌ను మరియు వంతెనను అమెరికా పూర్తిగా ధ్వంసం చేస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ట్రంప్ తాను ఇక ఎంతమాత్రం వేచి చూసే మూడ్‌లో లేనని స్పష్టం చేశారు. ఒకవైపు దౌత్యపరమైన తలుపులు తెరిచి ఉంచుతూనే, మరోవైపు ట్రంప్ చేసిన ఈ సైనిక హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

సీజ్‌ఫైర్ ఉల్లంఘనపై తీవ్ర ఆరోపణలు

ఇరాన్ కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందాన్ని ఉల్లంఘించిందని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం.. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులకు తెగబడిందని, ఫ్రాన్స్, బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ నౌకలను లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. ఇరాన్ చర్యలు ఏమాత్రం బాలేవని, ‘టఫ్ గై’గా కనిపించే ప్రయత్నంలో ఆ దేశం తనను తాను నష్టపరుచుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సముద్ర మార్గం మూసుకుపోవడం వల్ల ఇరాన్‌కు రోజుకు సుమారు 50 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని, అమెరికాపై మాత్రం దీని ప్రభావం ఏమీ లేదని ట్రంప్ పేర్కొన్నారు.

Also Read: షమీ రికార్డును సమం చేసిన ఆర్చర్!

ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలు

ఉద్రిక్తతలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలకు రంగం సిద్ధమైంది. తన ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఈ కీలక చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకుంటున్నట్లు ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. ఏదైనా ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడానికి తన ప్రతినిధులు అక్కడ చర్చలు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఈసారి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికీ ట్రంప్ సన్నిహితులు వెళ్లడం చూస్తుంటే అమెరికా ఈ ఒప్పందంపై ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతోంది.

ఇంధన మార్కెట్. అమెరికా వ్యూహం

ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ట్రంప్ తన దేశ ఆర్థిక బలాన్ని ప్రదర్శించారు. ఇరాన్ చర్యల కారణంగా చమురు, ఇంధన నౌకలు ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలస్కా వంటి ఓడరేవుల వైపు మళ్లుతున్నాయని ఆయన చెప్పారు. ఇరాన్ తన పనుల ద్వారా తెలియకుండానే అమెరికాకు మేలు చేస్తోందని, ప్రపంచం ఇప్పుడు అమెరికన్ ఇంధనంపై నమ్మకాన్ని పెంచుకుంటోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరి కళ్లు ఇస్లామాబాద్ సమావేశంపైనే ఉన్నాయి. ఈ చర్చలు శాంతికి దారితీస్తాయా లేక ట్రంప్ హెచ్చరికలు నిజమై మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం మొదలవుతుందో చూడాలి.

  Last Updated: 19 Apr 2026, 09:02 PM IST